కలం, కరీంనగర్: గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి (Chamanpalli) గ్రామంలో మహిళా సంఘాల భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. గ్రామంలో రహదారుల నిర్మాణం, చెరువులకు నీటి సరఫరా, రైతుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రహదారుల అభివృద్ధికి ప్రత్యేక కృషి
గ్రామంలో రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు దశలవారీగా పనులు చేపట్టినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. తొలుత ఇరుకుల్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, అనంతరం ఎదురుగట్టు, ఎల్లమ్మ, ఫకీర్ పేట రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎదురుగట్టు రహదారితో పాటు పెద్ద వంతెన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. అయితే నిధుల విడుదల, కాంట్రాక్టర్ల సమస్యల కారణంగా కొన్ని పనులు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. చామనపల్లి గ్రామంలో రహదారుల అభివృద్ధికి ఇప్పటికే రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేపట్టడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని అన్నారు.
రైతులకు అండగా ఉంటా
రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రాజసముద్రం చెరువుకు నీటిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు గంగుల కమలాకర్ తెలిపారు. చెరువు ఎండిపోతుందనే ఆందోళనతో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడిందని, ఈ సమస్యను అధిగమించేందుకు సుమారు కిలోమీటరు పొడవున నీటి సరఫరా కోసం తూము ఏర్పాటు చేయించినట్లు వివరించారు. దీంతో చెరువులోకి నీరు చేరి రైతులకు కొంత ఊరట కలిగిందన్నారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించుకోవాలని, గ్రామంలోని చెరువులు నిండుగా ఉండాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఎండ తీవ్రతతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా అధిగమించాలని సూచించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
గ్రామ సర్పంచి ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజల కోసం పనిచేయడమే ముఖ్యమని గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వాల నుంచి నిధులు సాధించి గ్రామాభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. చామనపల్లి గ్రామంలో మహిళా సంఘాలు మరింత బలోపేతం కావాలని, మహిళలు ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మహిళా సంఘాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గ్రామంలో రహదారులు, సాగునీటి వసతులు మెరుగుపడటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
మహిళా సంఘాలకు ఫర్నిచర్ హామీ
సంఘ భవనాల్లో ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని మహిళలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను కోరారు. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ మూడు మహిళా సంఘాల భవనాలకు ఒక్కో భవనానికి 30 చొప్పున కుర్చీలతో పాటు బీరువాలు, ఫ్యాన్లు, టేబుళ్లు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో పాటు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, స్థానిక సర్పంచి బోగొండ ఐలయ్య, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, నాయకులు సుంకిశాల సంపత్ రావు, మేరుగు సాయి కృష్ణ యాదవ్, కూర శ్యాంసుందర్ రెడ్డి, రంగారెడ్డి, వడ్లకొండ పరశురాములు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

