కలం, ఖమ్మం బ్యూరో: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కోయ భాషా (Koya Language) వికాసంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఐటీడీఏ సహకారంతో భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో 12వ జాతీయ గోండి–కోయ భాషా ప్రామాణీకరణ నిఘంటువు రూపకల్పన వర్క్షాప్పై ఆదివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోయ భాషా నిఘంటువులో ఏకంగా 20 వేలకుపైగా కొత్త పదాలను చేర్చినట్లు ప్రతినిధులు వెల్లడించారు.
అక్టోబర్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు దేశంలోని తొమ్మిది విభిన్న రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది ప్రతినిధులు, భాషా నిపుణులు హాజరయ్యారు. ఆదివారం నాటి సమీక్షా సమావేశంలో కోయ భాషను భావితరాలకు పదిలంగా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పాఠశాల స్థాయి నుంచే మాతృభాషా విద్యను ప్రోత్సహించాలన్నారు. ఇందులో భాగంగా కోయ బాల సాహిత్యం, చిన్న పిల్లల గేయాలు, ప్రాథమిక పాఠ్యపుస్తకాలు బహుభాషా నిఘంటువులను త్వరితగతిన రూపొందించాలని తీర్మానించారు.
అలాగే డిజిటల్ మాధ్యమాల ద్వారా కోయ భాషా వనరులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కోయ భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

