కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయం (Mahashakti Temple)లో విజయ దశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. తొలిరోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి (శైలపుత్రి) రూపంలో సూర్యప్రభ అలకంరణ చేశారు. బాలా త్రిపుర సుందరీ దేవి అవతారం శక్తి, జ్ఞానం, ధైర్యం, నిర్మలత్వానికి ప్రతీక. శరన్నవరాత్రుల ఆరంభంలో ఈ బాలరూపాన్ని ఆరాధించడం ద్వారా దైవభక్తితోపాటు మంచి విలువలను జీవితంలో ఆచరించాలనేది సందేశం. బాలా త్రిపుర సుందరీ దేవి ఆరాధన మనిషిలోని నిర్మలత్వాన్ని మేల్కొలిపి, జ్ఞానమార్గంలో నడిపిస్తుందని భక్తుల విశ్వాసం. దుర్గమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమివ్వడం భక్తులకు కనువిందు చేసింది. తొలిరోజు వేలాది భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
ఉదయం 11 గంటలకు ధ్వజరోహణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయాన్ని దర్శించుకున్న వేలాది మంది భక్తులు, ముఖ్యంగా భవానీ దీక్షాపరులకు ఆలయ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించారు. నవరాత్రులు ముగిసే వరకు భోజనం, అల్పాహారం అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.మరోవైపు ఆదివారం నుండి నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు సాయంత్రం బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ ‘శ్రీ భాగవత వైభవం’పై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్న ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అధ్యాత్మిక భావన, భక్తి పాటలతో ‘‘దాండియా’’ కార్యక్రమం నిర్వహించనున్నారు.

