కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు (Durga Devi Navaratri) అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెలంగాణ, ఏపీలోని ప్రాముఖ్య పుణ్యక్షేత్రాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలతో పాటు గ్రామాల్లోనూ దుర్గామాత విగ్రహ ప్రతిష్టతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. నవదుర్గలుగా తొమ్మిది రూపాల్లో పూజలందుకునే ఆదిశక్తి నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం అయ్యాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కంధమాత, కాత్యాయనీ దేవి, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి రూపాల్లో లలితా పరాభట్టారిక అయినటువంటి జగన్మాత దర్శనం ఇవ్వనున్నారు.
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు..
ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ కనుకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో బెజవాడకు చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలిరోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. పండితుల వేద ఘోష నడుమ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. “శ్రీ మాత్రే నమః” నామ స్మరణతో భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటున్నారు.
శ్రీశైలంలో ఉత్సవాలు..
అటు దుర్గమ్మ కొండపై ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలం భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబికా, పెనుగంచిప్రోలు తిరపతమ్మ తల్లి అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పంచారామ క్షేత్రాలతోపాటు రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
వరంగల్ భద్రకాళీ ఆలయంలో ఉత్సవాలు..
తెలంగాణలోని ప్రముఖ దేవీ పుణ్యక్షేత్రం వరంగల్ భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. భద్రకాళీ, భద్రేశ్వరులను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. “ఓం శ్రీ భద్రకాళీ శరణం మమః” నామస్మరణతో ఆలయ పరిసరాలు మరుమరుగుతున్నాయి. నవరాత్రి సందర్భంగా భక్తులు తన్మయత్వంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవీ నవరాత్రుల్లో ఆదిశక్తి అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమావారికి వేద పండితులు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారు సాయంత్రం బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. భద్రకాళీ సన్నిధికి భక్తులు భారీగా చేరుతుండటంతో పోలీస్ అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు.
వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరీ దేవి..
దక్షిణ కాశీ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో వైభవోపేతంగా, బ్రాహ్మణ పండితుల వేద ఘోష నడుమ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రాజన్న ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలోనూ నవరాత్రి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆలయంలో ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శరన్నవరాత్రుల తొలిరోజైన ఆదివారం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
బాసర, అలంపూర్, ఏడుపాయలలో ఉత్సవాలు..
చదవుల తల్లి, బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలంపూర్ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలు అట్టహాసంగా మొదలయ్యాయి. భద్రాచలం, ఏడుపాయల వనదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ధర్మపురి, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి దేవాలయాల్లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

