2028 జూన్ నాటికి SLBC పూర్తి చేయడమే నా లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: 2028 జూన్ నాటికి శ్రీశైలం సొరంగ మార్గం పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే తన జీవిత లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని రహదారులను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని, నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి, గూడేనికి డబుల్ రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. ఆదివారం నల్గొండ జిల్లాలో రూ.74 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పలు రోడ్డు విస్తరణ, పటిష్టపరిచే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

కనగల్ మండలం తేలకంటిగూడెం (Telakantigudem) వద్ద రూ.41 కోట్లతో తేలకంటిగూడెం నుండి తొరగల్లు, జంగమాయి గూడెం మీదుగా ముషంపల్లి వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. శేరి లింగోటం వద్ద రూ.33 కోట్లతో నల్గొండ-నిడమానూరు రోడ్డు నుండి చెట్ల చెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం మీదుగా ముషంపల్లి వరకు చేపట్టే విస్తరణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి (Minister Komatireddy) మాట్లాడుతూ.. జిల్లాలో రూ.1,600 కోట్లతో రోడ్ల నిర్మాణం, రూ.900 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మెరుగైన రహదారుల వల్ల పరిశ్రమలు, రైస్ మిల్లులు ఏర్పాటై యువతకు ఉపాధి లభించడంతో పాటు భూముల విలువ కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని గుడిసెలు లేని తెలంగాణగా మార్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. తేలకంటిగూడెం గ్రామానికి ఇప్పటికే 107 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, మిగిలిన అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా ఇళ్లు అందిస్తామన్నారు. సాంకేతిక సమస్యలు (L-1, L-3) ఉన్నప్పటికీ అర్హులకు న్యాయం చేస్తామని, ఇళ్ల పట్టాలు లేని వడ్డెర కులస్తులకు ఇప్పటికే పట్టాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు.

ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.2 లక్షల పంట రుణమాఫీ వంటి హామీలను నెరవేర్చామని మంత్రి తెలిపారు. రాబోయే బతుకమ్మ పండుగకు మహిళలకు చిలకపచ్చ రంగు చీరలు అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు, రైతులకు పిలుపునిచ్చారు.

నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ తాగునీటి కోసం చెరువులను నింపే చర్యలు తీసుకున్నామని కోమటిరెడ్డి చెప్పారు. శ్రీశైలం సొరంగ మార్గం పూర్తయితే ప్రతి ఎకరాకూ నీరు అందించి, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఆర్ అండ్ బి ఎస్.ఈ. మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ప్రజాప్రతినిధులు గుమ్మల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచులు, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీ దద్దరిల్లేలా.. మహాధర్నాకు ఇండియా కూటమి పిలుపు, హైఅలర్ట్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>