కలం, వెబ్ డెస్క్: సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లేలా ఇండియా కూటమి (INDIA Bloc) మహాధర్నాకు పిలుపునివ్వడంతో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల తొలగింపు అంశంపై వెనక్కి తగ్గని కాంగ్రెస్ నేతలు భారీ నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఇతర విపక్ష నేతలు పాల్గొననున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వైపు మార్చ్ నిర్వహించడంతో పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని విపక్ష నేతల బృందం కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించి, భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు కీలక కాంగ్రెస్ నేతలు ఈ మహాధర్నాకు హాజరుకానున్నారు. గతంలో నీట్ సహా పలు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు ఓట్ల తొలగింపు అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుంటోంది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఇండియా కూటమి (INDIA Bloc) భావిస్తోంది.
Also Read : యునిసెఫ్‌తో స్మృతి కొత్త ప్రయాణం.. బాలికల కోసమే!
Follow Us On: Youtube

