కలం, మిర్యాలగూడ : మిర్యాలగూడ (Miryalaguda Fire Accident) పట్టణంలోని ఇస్లాంపురం ప్రాంతంలో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక చెప్పుల గోదాంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో గోదాంలో నిల్వ ఉంచిన సరుకంతా పూర్తిగా దగ్ధం కావడంతో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అత్యవసరంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడే ఉండి సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మంటలను త్వరగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణ చర్యలు చేపట్టారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక వాటర్ ట్యాంకర్లను తెప్పించి సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించకుండా అడ్డుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సేవలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అభినందించారు. అనంతరం గోదాంలో జరిగిన ఆస్తినష్టంపై పూర్తి వివరాలు సేకరించాలని, బాధితులను ఆదుకునే దిశగా తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

