గుట్టుచప్పుడు కాకుండా పేకాట దందా.. సూత్రధారులు ఎవరెవరు?

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda Gambling) జిల్లాలో కొన్నాళ్లుగా రహస్యంగా నిర్వహిస్తోన్న పేకాట దందాపై స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) దృష్టి సారించింది. దీని వెనుక ఉన్న సూత్రధారులు, నిర్వాహకులు, వారికి సహకరిస్తున్న వ్యక్తులెవరనే కోణంలో విచారణ చేస్తోంది. ఆరు నెలలుగా దందా నడుస్తుండగా స్థానిక పోలీసుల నిఘా, టాస్క్‌ఫోర్స్‌ పనితీరుపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు పేకాట దందాలో ప్రజాప్రతినిధి జోక్యం, ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

నెల రోజుల కిందటే పట్టుబడినా..

ఇదే పేకాట బ్యాచ్ నెల రోజుల కింద మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో ఆడుతుండగా, అందులో కొందరిని స్థానిక పోలీసులు పట్టుకోగా ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకున్నారు. దీంతో పేకాట నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోకుండా, పట్టుబడిన వారిలో కొందరు సాధారణ వ్యక్తులపై మాత్రమే చిన్నపాటి కేసులు నమోదు చేసి వదిలేశారనే ప్రచారమూ ఉంది. ఇంతకూ పేకాట దందా నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కేసులు పెట్టకపోవడానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్లక్ష్యమా.. చూసి వదిలేశారా..!

నెలల తరబడి పేకాట దందా కొనసాగుతుండగా స్థానిక పోలీసులకు సమాచారం లేదా? నిఘా విభాగాలు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఎందుకు గుర్తించలేకపోయారు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. పేకాట శిబిరాలపై నిఘా పెట్టడడంలో నిర్లక్ష్యమా? లేక ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్లు వదిలేశారా ? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.

పదేపదే పట్టుబడుతున్నా..

పేకాట దందాకు పదే పదే పాల్పడుతున్న వ్యక్తులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. రాష్టం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ హయాంలో గుడుంబా, గుట్కా, మట్కా, పేకాట, గంజాయి, పీడీఎస్ తదితర అక్రమ వ్యాపారాలపై కఠినచర్యలు తీసుకుంది. వరుస నేరాలకు పాల్పడుతున్న కొందరిపై రౌడీషీట్లతో పాటు కొంతమందిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి కటాకటాల్లోకి నెట్టింది. ఇప్పుడు కూడా పేకాట దందా నిర్వాహకుల చరిత్రను పరిశీలించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ప్రజల నుంచి వస్తున్నాయి.

సూత్రధారులపై చర్యలు ఎప్పుడు?

పేకాట ఆడుతూ పట్టుబడిన వారిపై చర్యలు తీసుకోవడంతోనే వ్యవహారం ముగిసిపోకూడదని, అడ్డాల నిర్వహణ అసలు సూత్రధారులను గుర్తించి యాక్షన్ తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దందా వెనుక ఎవరున్నారు? నిర్వాహకులకు సహకరించిందెవరు? మామునూరులో పట్టుబడిన ఘటనలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ముడుపుల ఆరోపణలకు ఆధారాలున్నాయా? అనే ప్రశ్నలకు ఎస్‌బీ విచారణలో స్పష్టత వస్తుందా.. అనేది ఆసక్తికరంగా మారింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>