రైతు బీమాపై వీడని సస్పెన్స్.. రైతు కుటుంబాల్లో ఆందోళన!

కలం, నల్లగొండ బ్యూరో : రాష్ట్రంలో పేద రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన రైతు బీమా (Rythu Bima) పథకం అమలుపై అయోమయం, అస్పష్టత నెలకొంది. ఏటా ఆగస్టు 14 నాటికి రెన్యూవల్ కావలసిన పథకానికి ఈసారి ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం నిధులు చెల్లించకపోవడంతో క్లెయిమ్‌ల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత రైతు కుటుంబాలకు పరిహారం అందుతుందో లేదో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గడువు ముగిసి రెండు నెలలైనా..

ఏటా వ్యవసాయ శాఖ ద్వారా 18 – 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన పట్టాదారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100శాతం ఉచితంగా రైతు బీమాను వర్తింపజేస్తోంది. రూల్స్ మేరకు ఆగస్టు 14 నుంచి మరుసటి ఏడాది ఆగస్టు 13 వరకు బీమాకు రక్షణ వర్తిస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఐసీకి ప్రీమియం ఇంకా విడుదల చేయలేదు. ఇందుకు బడ్జెట్ కేటాయింపులు, నిధుల కొరత కారణంగా ఉంది. స్కీమ్ ప్రీమియం గడువు ముగిసి రెండు నెలలవుతున్నా ఇంకా చెల్లించకపోవడంతో సాంకేతికంగా ఎల్‌ఐసీ నుంచి రావాల్సిన రూ. 5 లక్షల బీమా పరిహారం నిలిచిపోయింది.

ఆ రోజు తర్వాత నుంచి పరిస్థితేంటి?

గత ఆగస్టు 14 తర్వాత నుంచి మృతిచెందిన రైతుల వివరాలను క్షేత్రస్థాయి అధికారులు సేకరించి రైతు బీమా పోర్టల్ లో నమోదు చేస్తున్నారు. కానీ గతంలో మాదిరిగా దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే కుటుంబ ఖాతాలో రూ.5 లక్షల సొమ్ము జమ అవుతుందా..! లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో ‘మాకు బీమా వర్తిస్తుందా? పైసలు వస్తాయా రావా?’ అంటూ బాధిత రైతు కుటుంబాలు వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వం పాత రైతు బీమా రూపరేఖలను మార్చి, కేవలం రైతులకే కాకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి వర్తించేలా ఇందిరమ్మ బీమా పేరిట సరికొత్త సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తోంది. వచ్చే నవంబరు 19 నుంచి ఈ కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్త పథకానికి సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఇక గత ఆగస్టు 14 తర్వాత మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఎలా చెల్లిస్తారనే దానిపై తీవ్ర గందరగోళం ఏర్పడింది.

ప్రభుత్వం స్పందించి స్పష్టత ఇస్తేనే..

ఇంటి పెద్దను కోల్పోయి ఆర్థికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఎల్‌ఐసీకి బకాయి ప్రీమియం చెల్లించి, క్లెయిమ్‌లను పరిష్కరించి రైతులకు భరోసా కల్పించాలి. పథకాల మార్పు, రీ బ్రాండింగ్ నిర్ణయాలు ఎలా ఉన్నప్పటికీ, ఆగస్టు 14 తర్వాత మరణించిన నిరుపేద రైతు కుటుంబాలకు వెంటనే పాత నిబంధనల ప్రకారమైనా రూ.5 లక్షల పరిహారాన్నిమంజూరు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>