కలం, వెబ్ డెస్క్ : గిరిజన ప్రాంతాల్లో రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అడవితల్లి బాట 2.0’ (Adavi Thalli Bata) కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలోని కాకవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు ఈ రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మారుమూల గిరిశిఖర గ్రామాలకు సైతం డోలీ మోతల బాధలను తప్పించి, పక్కా రహదారి సౌకర్యం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ రెండో దశలో భాగంగా రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 1,341 ఆవాసాలను కలుపుతూ మొత్తం 1,976 కిలోమీటర్ల మేర నూతన రోడ్లను నిర్మించనున్నారు. దీనికి అదనంగా మరో 150 ఆవాసాలకు రూ.425 కోట్లతో మరో 450 కి.మీ. మేర రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ఈ సర్క్యూట్ రోడ్ల నిర్మాణం ద్వారా మన్య ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందడంతో పాటు రవాణా సదుపాయాలు మెరుగవుతాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది.

