కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఈరీ నగరంలో (Erie Shooting) దారుణ కాల్పుల ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక దుండగుడు నివాస గృహంలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 8 నెలల గర్భిణి, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. అనంతరం సదరు నిందితుడు కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ వివాదమే కారణమా?
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఈ ఘటన వెనుక కుటుంబ తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో నిందితుడి బంధువులతో పాటు కుటుంబ మిత్రులు ఉన్నారు. కాల్పుల శబ్దాలు విన్న పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఈరీ నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే నిందితుడు ఆత్మహత్య చేసుకుని మరణించాడు.
ఈ దారుణ ఉదంతంపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన, ఈరీ నగర పరిపాలనా విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరీ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన మారణకాండ అని స్థానిక అధికారులు వ్యాఖ్యానించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

