ముష్టిబండలో భూవివాదం.. మంత్రి పొంగులేటికి బాధితుల వినతి

కలం, సత్తుపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ(Mustibanda) గ్రామంలో దళితులకు చెందిన సుమారు 80 ఎకరాల ఇనాం భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధిత ఎస్సీ (మాదిగ) కుటుంబాలు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Minister Ponguleti) శనివారం ఆశ్రయించాయి. దశాబ్దాలుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం సమర్పించాయి.

ముష్టిబండ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 114/3/8, 114/2, 114/2/1, 114/1లో ఉన్న సుమారు 80 ఎకరాల భూమిని తమ పూర్వీకులు చేసిన వెట్టిచాకిరీకి ప్రతిఫలంగా అప్పటి నిజాం ప్రభుత్వం ఇనాం కింద కేటాయించిందని బాధితులు తెలిపారు. 1954 నుంచి 1991 వరకు ఈ భూములకు సంబంధించి తమ పూర్వీకుల పేర్లపైనే ఇనాం పట్టాలు నమోదై ఉన్నాయని వివరించారు. అయితే తమ పూర్వీకులు నిరక్షరాస్యులు, ఆర్థికంగా వెనుకబడినవారు కావడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గిరిజనేతరులు ఈ భూములను ఆక్రమించుకున్నారని బాధితులు ఆరోపించారు. గొట్టిపూళ్ల దుర్గా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, సాయినరావుపాలెం గ్రామానికి చెందిన గంగాధరరావు, ఆయన కుటుంబ సభ్యులు అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించుకున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.

గత 25 ఏళ్లుగా భూహక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నప్పటికీ తమ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. రెవెన్యూ కార్యాలయాల్లో విచారించగా రికార్డులు మారిపోయాయని అధికారులు చెబుతుండటంతో తమ పూర్వీకుల భూములపై హక్కులను నిరూపించుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యవహారంపై స్పందించి పాత రెవెన్యూ రికార్డులు, ఇనాం పట్టాలు, భూముల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించాలని బాధితులు కోరారు. చట్టపరమైన ఆధారాలను పరిశీలించి సమగ్ర విచారణ జరిపించాలని, తమ పూర్వీకుల నుంచి సంక్రమించాల్సిన భూములను తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>