కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియాను హౌతీలు మరోసారి లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. అత్యంత రద్దీగా ఉండే రియాద్ ఎయిర్పోర్టుపై (Riyadh Airport) మరోసారి రాకెట్లు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను వెంటనే అధికారులు ఖాళీ చేయించారు. ఇక్కడకు వచ్చే అన్ని విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. రెండు రోజుల కిందట జరిగిన దాడిలో పైలట్ సహా ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. శనివారం హౌతీలు జరిపిన దాడిలో 3, 4వ టెర్మినళ్లను తాకాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
పదుల కొద్దీ అంబులెన్సులను రప్పించి.. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మూడు రోజుల కిందట చేసిన దాడికి తమదే బాధ్యత అని ప్రకటించుకున్న హౌతీలు.. శనివారం మాత్రం అలాంటిదేమీ చేయలేదు. సౌదీపై హౌతీల దాడులు చేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. “ఈ పరిణామాలను ప్రస్తుతం పరిశీలిస్తున్నాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

