ఉపాధి క‌ల్ప‌న‌లో దూసుకెళ్తున్న రాజ‌న్న‌ సిరిసిల్ల‌

కలం, రాజన్న సిరిసిల్ల: రాజ‌న్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా అభివృద్ధిలో మ‌రో మైలురాయిని అధిగ‌మించింది. గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం వీబీజీ రామ్ జీ (VB-G RAM G) అమ‌లులో రాష్ట్రంలోనే ప్ర‌థ‌మ స్థానంలో నిలిచి అగ్ర‌గామిగా దూసుకుపోతోంది. శాశ్వ‌త ఆస్తుల క‌ల్ప‌న, వ‌న‌రుల సంర‌క్ష‌ణ‌తో పాటు కూలీల‌కు భారీగా ఉపాధి క‌ల్పిస్తున్న జిల్లా యంత్రాంగం, క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ్ర‌వాల్‌ను రాష్ట్ర స్థాయి అధికారులు ప్ర‌త్యేకంగా అభినందించారు.

విస్తృతంగా ఉపాధి హామీ పనులు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్– గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవక మిషన్ (వీబీజీ రామ్ జీ) కార్యక్రమం కింద పనులను విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ఉపాధి పనులపై జిల్లాలోని ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా పనులు గుర్తించి చేయిస్తున్నారు.

గొర్రెల షెడ్లు, కంపోస్టు షెడ్ల నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 378 పనులు గుర్తించింది. రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు అనువైన, కూలీలకు ఉపాధి కల్పించే పనులను అధికార యంత్రాంగం చేపడుతుంది. అధికారులు ప్రతి కూలీకి 125 పని దినాలు కల్పించేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. చెరువుల్లో పూడిక తీత, మట్టి రోడ్ల నిర్మాణం, ఫిష్ పాండ్స్, అటవీ భూముల్లో కందకాల నిర్మాణం, మొక్కలు నాటడం, సంరక్షించడం, అటవీ భూముల్లో మొక్కలు నాటడం, పశువులు, గొర్రెల షెడ్ల నిర్మాణం, కంపోస్టు షెడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు ప్రాధాన్య ఇస్తూ ముందుకు సాగుతున్నారు. పొలాల కాలువల శుభ్రత, సాగునీటి కాలువల మరమ్మతు లాంటి శ్రమ ఆధారిత పనులను గుర్తించి చేయిస్తున్నారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించి, మొబైల్ ఫోన్ ద్వారా హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టారు.

కూలీల సంఖ్య‌ పెంచేందుకు చర్యలు

జిల్లాలో మొత్తం 260 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 98 వేల జాబ్ కార్డులు ఉన్నాయి. ప్రతి రోజు 32,148 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు 4,02,360 పని దినాలు కల్పించారు.

తెలంగాణ జలసిరి పనులు

వాన నీటి సంరక్షణ, భూ గర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పథకం కింద పనులు చేయిస్తుంది. జిల్లాలో 210 ఫామ్ పాండ్స్, 1769 మ్యాజిక్ సోక్ పిట్స్, 91 సామూహిక ఇంకుడు గుంతలు, 464 బోర్ వెల్ రీచార్జ్ గుంతల పనులు పురోగతిలో ఉన్నాయి.

రాష్ట్ర స్థాయి అధికారుల అభినందన

జిల్లాలో ఒక్కో గ్రామ పంచాయతీ నుంచి సగటున 45 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికం. ఉపాధి కల్పనలో ముందున్న జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను రాష్ట్ర స్థాయి అధికారులు అభినందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ కింద వేతనాలకు రూ.12 కోట్ల 90 లక్షలు ఇవ్వగా, మెటీరియల్ కోసం రూ.76 లక్షలు కేటాయించారు. మెటీరియల్ కోసం ఇంకా రూ.7 కోట్ల 37 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది.

కూలీలకు పని కల్పించేలా ప్రణాళిక: కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వీబీ జీ రామ్ జీ కింద కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ గ‌రిమ అగ‌ర్వాల్ చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు తమ ప్రాంతంలో అనువైన పనులు చేయించడంపై శిక్షణ ఇప్పించామ‌న్నారు. పనులకు కూలీలు భారీ సంఖ్యలో వస్తున్నార‌ని తెలిపారు. ఉపాధి క‌ల్ప‌న‌లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉంద‌ని, ఇదే స్పూర్తితో ముందుకు వెళ్తామ‌ని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>