కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026’కు (Police Sports Meet 2026) సంబంధించి యాదాద్రి-V జోనల్ స్థాయి క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేయడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. క్లస్టర్-డి పోటీలను నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహిస్తారని, క్లస్టర్-ఈ పోటీలు నవంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీలలో భాగంగా వివిధ క్రీడాంశాల్లో పురుషులు, మహిళా పోలీస్ సిబ్బందికి వేర్వేరుగా విభాగాల వారీగా పోటీలు ఉంటాయని తెలిపారు. నల్లగొండలో నిర్వహించిన యాదాద్రి-V జోనల్ స్థాయి ఎంపికల్లో పాల్గొన్న క్రీడాకారుల ప్రతిభ, శారీరక సామర్థ్యం, క్రీడా నైపుణ్యం, ప్రదర్శన ఆధారంగా ఉత్తమ జట్టును ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
‘పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మానసిక ఉల్లాసాన్ని అందించే క్రీడలు విధి నిర్వహణలో మరింత చురుకుదనాన్ని నింపుతాయి’ అని ఎస్పీ తెలిపారు. క్రీడాకారులకు పోలీస్ శాఖ తరఫున పూర్తి ప్రోత్సాహం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సంతోష్, హరిబాబు, శ్రీనులతో పాటు భారీ సంఖ్యలో పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు.

