కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్లోని ప్రసిద్ధ శ్రీ మహాశక్తి దేవాలయం (Mahashakti Temple) భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. రాబోయే 11 రోజుల పాటు దీక్షా కాలంలో ఆలయ ప్రాంగణంలోనే బస చేయనున్నట్లు తెలిపారు. దీక్షా నియమాలను పాటిస్తూనే, ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. బతుకమ్మ సందర్బంగా మహిళల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయించారు.
బతుకమ్మ వేడుకల్లో గంగుల
మరోవైపు నగరంలోని 45వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బతుకమ్మను ఎత్తుకుని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరూ కలిసిమెలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ నగర ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

