అడవి నుంచి ఆధునికత వైపు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 10 ఏళ్లు!

కలం, ఖమ్మం బ్యూరో: ​ఒకప్పుడు దట్టమైన అడవులు, సింగరేణి బొగ్గు గనుల చప్పుడు, నిరంతరం హోరెత్తే గోదావరి ప్రవాహం మాత్రమే ఆ నేలకి తెలుసు. అవే ప్రధాన వనరులు కూడా. కాల ప్రవాహంలో తనదైన కొత్త ముద్ర వేసుకోవాలని తపించిన ఆ ప్రాంతం. 2016 అక్టోబరు 11న పూర్వపు ఖమ్మం జిల్లా భుజాల మీద నుంచి వేరుపడి ‘భద్రాద్రి కొత్తగూడెం’ (Bhadradri Kothagudem) పేరుతో స్వతంత్ర జిల్లాగా నూతన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది కేవలం సరిహద్దులు మారిన పరిపాలనా మార్పు కాదు.. తరతరాల గిరిజన ప్రజల, స్థానికుల భవిష్యత్తు రూపురేఖలను సమూలంగా మార్చే గొప్ప సంకల్పం. సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ స్వతంత్ర వికాస ప్రయాణంలో జిల్లా ఎన్నో అడుగులు ముందుకు వేసింది.

పేదోడి చెంతకు అన్ని వసతులు

​కొత్తగూడెం నడిబొడ్డున ఆధునిక హంగులతో వెలసిన సమీకృత కలెక్టరేట్ భవనం పరిపాలనను సామాన్యుడి ముందుకు తెచ్చింది. నిన్నమొన్నటి వరకు వైద్యం కోసం మైళ్ల దూరం ప్రయాణించి పల్లె ప్రజలకు, నేడు అదే గడ్డపై సూపర్‌స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసింది. గోదావరి అలల పక్కన అశ్వాపురం వద్ద రూపుదిద్దుకుంటున్న సీతమ్మ సాగర్ మల్టీపర్సస్ ప్రాజెక్టు, మణుగూరు కొండల మధ్య వెలిసిన భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ జిల్లా దాహాన్ని తీర్చడమే కాకుండా రాష్ట్ర ప్రగతికే కొండంత తోడ్పాటునందించాయి. సింగరేణి బొగ్గు గనుల ఆధునికీకరణ, ఐటీసీ పేపర్ బోర్డు విస్తరణతో నల్లతంగేడు పొలాల మధ్య పరిశ్రమల శబ్దం ప్రతిధ్వనించింది. ఇక కొత్తగూడెం-సత్తుపల్లి నూతన రైల్వే లైన్, రహదారుల విస్తరణ వ్యాపార, రవాణా రంగాలకు వేగాన్నిచ్చాయి. దశాబ్దాలుగా తాము సాగు చేస్తున్న భూములపై హక్కుల్లేక సతమతమైన గిరిజన రైతులకు పోడు పట్టాల పంపిణీ ద్వారా చట్టబద్ధమైన హక్కు లభించి, వారి జీవితాల్లో సరికొత్త భరోసా చిగురించింది.

ఆధునికత వైపు వేగంగా

​భద్రాచల ఆధ్యాత్మిక శోభ, సింగరేణి నల్లని బంగారం, గోదావరి జలసిరుల నడుమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఒకవైపు అడవి తల్లి ఒడిని కాపాడుకుంటూనే, మరోవైపు ఆధునిక ప్రగతి వైపు శరవేగంగా అడుగులు వేసింది. అడవి నుంచి ఆధునికత వైపు పడిన ఈ అడుగులు మరింత ముందుకు సాగుతున్నాయి. గిరిజన గుండెల్లోని ప్రతి ఆకాంక్షా నెరవేరిననాడే.. ‘ఖమ్మం కొమ్మ నుంచి ఉద్భవించిన ఈ స్వతంత్ర శిఖరం’ పరిపూర్ణ ప్రగతి కాంతులతో వెలిగిపోతుంది.

నేటికీ తీరని వేదనలు

​ఈ వికాస గాథలో సవాళ్లు లేకపోలేదు. ‘దారిన పడ్డ అభివృద్ధి’ తాలూకు వెలుగులు ప్రసరిస్తున్న వేళ, మరోవైపు కొన్ని తీరని వేదనలు అలాగే మిగిలి ఉన్నాయి. ప్రతి ఏటా వర్షాకాలంలో గోదావరి ఉప్పొంగినప్పుడు భద్రాచలం పరిసర ప్రాంతాలు, పినపాక ఏజెన్సీ గ్రామాలు నీటమునిగే దృశ్యాలు ఇంకా భయపెడుతూనే ఉన్నాయి. ఆ వరదల నుంచి ప్రజలను కాపాడటానికి శాశ్వత కరకట్టల నిర్మాణం, భద్రాచలానికి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసే ప్రత్యేక రైల్వే డివిజన్, అలాగే మూలమూల గిరిజన తండాలకు పక్కా రోడ్లు, నాణ్యమైన మొబైల్ నెట్‌వర్క్, విద్యుత్ సౌకర్యం వంటి ఆశయాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>