ఎన్నికల సంఘానికి మాజీ సివిల్ సర్వెంట్ల మద్దతు

కలం, నేషనల్ డెస్క్: ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరిగాయని, ఓట్ల చోరీ జరుగుతోందంని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తున్న వేళ.. 124 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఎన్నికల సంఘానికి (Election Commission)  అండగా నిలిచారు. తగిన ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పాల్గొనేందుకు యత్నించిన నలుగురు మాజీ సీఎంలు సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రజలను రెచ్చగొట్టొద్దు..

ఎన్నికల ప్రక్రియలో ఉన్న పారదర్శకతను వివరిస్తూ.. లేఖలో కీలక అంశాలను మాజీ సివిల్​ సర్వెంట్లు ప్రస్తావించారు. ‘‘మీరు గెలిచినప్పుడు కరెక్ట్​ అనిపించిన వ్యవస్థ.. ఓడిపోయినప్పుడు రిగ్గింగ్ అని ఎలా అవుతుంది? మీరు సందేహిస్తోంది ఎన్నికల వ్యవస్థనా? లేక వెలువడిన ఫలితంపైనా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రజల తీర్పు ద్వారా తిరస్కరించిన తర్వాత, రాజకీయంగా ఉనికి చాటుకోవడం కోసం ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రజలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం’’అని మాజీ సివిల్​ సర్వెంట్లు హితవు పలికారు.

ఎన్నో ఎన్నికలు చూశాం..

తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవారం కాదని, ఉద్యోగ జీవితంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల తయారీ, ఈవీఎంల భద్రత (స్ట్రాంగ్ రూమ్‌లు) వంటి ప్రక్రియల్లో డైరెక్ట్​గా పాల్గొన్నామని మాజీ సివిల్ సర్వెంట్లు లేఖలో తెలిపారు. ‘‘ఆధారాలు లేకుండా కేవలం రిగ్గింగ్ అనే ఒక్క మాటతో ఎన్నికల ప్రక్రియపై నిందలు వేయడం వలనే మేం స్పందిస్తున్నాం. గతంలో అసలైన రిగ్గింగ్ ఎలా ఉండేదో మాకు తెలుసు. పోలింగ్​ బూత్ కంట్రోల్​లోకి తీసుకోవడం, తుపాకులతో బెదిరింపులు, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లడం వంటి రోజులను మేము చూశాం. అందుకే 1989లో పార్లమెంట్​ బూత్ క్యాప్చరింగ్‌ను తీవ్ర నేరంగా ప్రకటించింది. హింస పెరిగిన చోట ప్రజాస్వామ్యం మూగబోతుంది’’అని లేఖలో మాజీ సివిల్​ సర్వెంట్లు పేర్కొన్నారు.

మెరుగుపడిన ఎన్నికల నిర్వహణ..

ప్రస్తుతం దేశంలో ఎన్నికల నిర్వహణ ఏ స్థాయిలో మెరుగుపడిందో చెప్పడానికి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మాజీ సివిల్ సర్వెంట్లు ఉదాహరణగా చూపారు. ‘‘ఒకప్పుడు బూత్ క్యాప్చరింగ్‌కు బీహార్​ కేరాఫ్​ అడ్రస్​గా ఉండేది. 2025 ఎన్నికల్లో చరిత్రలోనే మొదటిసారిగా ఒక్క బూత్‌లో కూడా రీ-పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదు. 1951 తర్వాత అత్యధిక ఓటింగ్ శాతంతో పాటు మహిళలు రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మార్పు అధికారుల వల్ల మాత్రమే రాలేదు. ఈసీఐ రూపొందించిన పారదర్శక వ్యవస్థ వల్ల సాధ్యమైంది’’అని లేఖలో పేర్కొన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు చదువుకోండి..

ప్రతి పోలింగ్ బూత్ వద్ద అన్ని పార్టీల పోలింగ్ ఏజెంట్లు పర్యవేక్షిస్తారు. పోలింగ్ ముగిశాక నమోదైన ఓట్ల వివరాల ప్రతిని ఏజెంట్లకు సంతకంతో ఇస్తారు. ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈ స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కాపలా ఉండే అవకాశం ఉంది. వీవీ ప్యాట్ పేపర్ స్లిప్పులను ఈవీఎం కౌంటింగ్‌తో సరిపోల్చే పద్ధతిని 2024లో సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. భారీ స్థాయిలో అక్రమాలు జరగాలంటే వేలాది మంది అధికారులు, చివరికి ఓడిపోయే పార్టీల ఏజెంట్లు కూడా సహకరించాలి. కానీ అలాంటి కుట్రలు జరిగినట్లు ఎప్పుడూ రుజువు కాలేదు’’ అని లేఖలో మాజీ సివిల్​ సర్వెంట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>