కలం, నల్లగొండ : రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం (El Nino Impact) అన్ని రంగాలపై పడే అవకాశం ఉన్నందున, వచ్చే జూలై వరకు అన్ని ప్రధాన శాఖలు ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ (Chandrashekar) ఆదేశించారు. సీజనల్ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్, త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రానున్న 270 రోజుల పాటు అధికారులందరూ పూర్తి అప్రమత్తంగా, చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతికూల పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాబోయే మూడు నెలలకు సరిపడా కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. బోర్ల రీఛార్జి, పైప్‌లైన్ల మరమ్మతులకు సంబంధించిన అంచనాలను రూపొందించాలని, మున్సిపాలిటీల్లో అమృత్ పనులతో పాటు స్థానిక నీటి వనరుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
వర్షాలు లేక పంటలు పండే పరిస్థితులు లేకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలకు ఇబ్బందులు కలగకుండా ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు చేపట్టి ఉపాధి కల్పించాలని సూచించారు. ఈ పనులకు ఎలాంటి పరిమితి లేదని, ప్రతి గ్రామంలో వెంటనే వాన నీటి సంరక్షణ పనులు చేపట్టాలని తెలిపారు. మ్యాజిక్ సోక్ పిట్లు, ఫామ్ పాండ్లు, పర్కులేషన్ ట్యాంకులను నిర్మించాలని ఆదేశించారు. ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్ ఉండేలా చూడటంతో పాటు సర్పంచులు, వార్డు సభ్యులను ఈ పనుల్లో భాగస్వాములను చేయాలన్నారు.
జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టం సగటున రెండు మీటర్లు తగ్గిందని, ముఖ్యంగా 16 మండలాల్లో తీవ్ర నీటి కొరత ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై విశ్లేషణాత్మక నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. దెబ్బతిన్న పంటల వివరాలు, రిజర్వాయర్లు, చెరువుల్లో ప్రస్తుత నీటి నిల్వలపై సమగ్ర నివేదికలు అందించాలని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక శాఖ ముందస్తు అంచనాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. అధికారులందరూ సమిష్టిగా పనిచేసి ఈ క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్ఓ దశరథ్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

