కలం, స్పోర్ట్స్: టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తాజాగా కీపింగ్ అవతారం ఎత్తాడు. 2026-27 రంజీ సీజన్ ముంగిట ముంబై ప్రాక్టీస్ సెషన్‌లో జైస్వాల్ కీపింగ్ గ్లోవ్స్‌తో మెరిశాడు. అయితే ఈ సందర్భంగానే జైస్వాల్‌కు భారత మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ (Wasim Jaffer) కీలక సూచన చేశారు. చిన్నతనం నుంచి అలవాటు లేని కీపింగ్‌ను ఇప్పుడు నేర్చుకోవడం ఎంతో కష్టమని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో కీపింగ్ చేయడం సాధారణ విషయం కాదని, ఈ నిర్ణయం విడ్డూరంగా ఉందన్నారు. కొత్త స్కిల్ నేర్చుకోవాలనే ఆరాటంలో తన అసలు బలమైన బ్యాటింగ్‌ను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పరిమిత ఓవర్ల జట్లలో చోటు దక్కించుకోవడానికే జైస్వాల్ ఇలా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని జాఫర్ తెలిపారు. ఇప్పటికే భారత జట్టులో రిషభ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి ప్రతిభావంతులైన కీపర్లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రాబోయే రంజీ ట్రోఫీ, తదుపరి న్యూజిలాండ్ పర్యటన దృష్ట్యా జైస్వాల్ తన బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టడం ఉత్తమమని స్పష్టం చేశారు.

