నవరాత్రి వేళ Gen Z కొత్త ట్రెండ్‌.. అందం కోసం ఆ ట్రీ‌ట్‌మెంట్!

కలం, వెబ్ డెస్క్: నవరాత్రి (Navaratri 2026) సెలబ్రేషన్స్ సమీపిస్తుండటంతో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా లాంటి నగరాల్లోని అమ్మాయిలు ఐవీ డ్రిప్స్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు. తొమ్మిది రోజులపాటు గర్బా, దాండియా ఆడుతూ అలసట లేకుండా ఉత్సాహంగా గడపాలనే ఉద్దేశంతో వీటిని తీసుకుంటున్నారు. ఐవీ డ్రిప్స్‌ ద్వారా ద్రవాలు, విటమిన్లు, ఇతర పోషకాలను నేరుగా రక్తంలోకి పంపిస్తారు. వీటిలో విటమిన్‌ సి, బి విటమిన్లు, జింక్‌ లాంటి పదార్థాలు ఉంటాయి. ఈ ట్రీట్‌మెంట్‌లో శరీరానికి తగినంత నీరు అందడంతోపాటు శక్తి పెరుగుతుందని, చర్మం కాంతివంతంగా మారుతుందని కొన్ని క్లినిక్‌లు ప్రచారం చేస్తున్నాయి.

ఒక్కో ఐవీ డ్రిప్‌ (IV Drips) సెషన్‌కు రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చవుతోంది. ప్రత్యేక ప్యాకేజీల ధర రూ.15,000 వరకు ఉంటోంది. గర్బా వేడుకల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు ఫొటోల్లో తాజాగా, అందంగా కనిపించేందుకు ఈ డ్రిప్స్‌ ఉపయోగపడతాయని యువత భావిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ గంటలు పనిచేసే ఉద్యోగులు, రాత్రివేళల్లో జరిగే వేడుకల్లో పాల్గొనేవారు కూడా అలసటను తగ్గించుకునేందుకు వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఐవీ డ్రిప్స్‌ తీసుకోవడం పూర్తిగా సురక్షితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలర్జీ ప్రతిచర్యలు, శరీరంలో అధికంగా ద్రవాలు చేరడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

అందువల్ల ఐవీ డ్రిప్స్‌ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అందం పెంచుకోవడానికి లేదా తక్షణ శక్తిని పొందడానికి ఇవి ఏదో అద్భుత పరిష్కారమని భావించకూడదని చెప్తున్నారు. నవరాత్రి వేడుకల్లో (Navaratri 2026) ఉత్సాహంగా పాల్గొనాలంటే తగినంత నీరు తాగడం, పోషక విలువలున్న ఆహారం, తగినంత విశ్రాంతి లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Also Read : నాని ‘బ్లడీ రోమియో’.. మాస్ మ్యాడ్‌నెస్‌కు రంగం సిద్ధం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>