కలం, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు సంఘం కోసం జరిగిన ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ,ఎన్ఎం యూ కూటమి గెలుపు కార్మికుల జీవితాలకే ఒక మలుపు అని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) పేర్కొన్నారు. ఎంప్లాయిస్ యూనియన్,టీఎంయూ, ఎన్ఎంయూ కూటమిల సమిష్టి కృషి, పట్టుదల మూలంగా ఆర్టీసీ ఎన్నికల్లో అత్యధిక డిపోలలో విజయం సాధించడం పట్ల, ఇంతటి భారీ మెజారిటీని అందించిన ప్రతి ఒక్క ఆర్టీసీ సోదరునికి, సోదరీమణులకు సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి పక్షాన శ్రీనివాస్ కృతజ్ఞతలు,శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టీసీ ఎన్నికల్లో కరీంనగర్ రీజనల్ జోన్ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయిస్ యూనియన్,టీఎంయూ, ఎన్.ఎం.యూ కూటమిని గెలిచినందున శనివారం కరీంనగర్ టూ డిపో ముందు పంజాల శ్రీనివాస్ ఆర్టీసీ కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. కార్మికులు,నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ .. దశాబ్ద కాలంగా ఆర్టీసీ సంస్థలో ఎన్నికలు లేకపోవడం వల్ల, సంఘాలను నిర్వీర్యం చేయడం మూలంగా కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడారని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవెళ్లడానికి, సంఘాల నాయకులకు కూడా చెప్పుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని ఎట్టకేలకు ఆర్టీసీ ఎన్నికలు జరిగాయన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడైనా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నైనా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి నాటి నుంచి నేటి వరకు దిక్సూచిగా నిలుస్తున్నది కేవలం ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమేనన్నారు. ప్రధానంగా కార్మిక సంక్షేమానికి కట్టుబడి ఉండి,నిజాయితీగా,నిబద్ధతో పనిచేయాలనే సంకల్పంతో ఎన్నికల్లో పోటీచేసిన ఎంప్లాయిస్ యూనియన్, టీఎంయూ, ఎన్.ఎం.యూ కూటమిని ఓడించడానికి ప్రత్యర్థి సంఘాలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్నడూ లేని విధంగా ఎన్ని కుట్రలు చేసినా, అధికార పార్టీ నాయకులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలుపు కోసం కార్మికుల మధ్య చిచ్చు పెట్టాలని చూసినప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, కార్మిక హక్కుల కోసం పోరాడే వారు కావాలని, ప్రశ్నించే గొంతుకలు గెలవాలని, కార్మిక సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేస్తున్న ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఎంప్లాయిస్ యూనియన్‌ను, టీఎంయూ, ఎన్.ఎం.యూ కూటమిని నమ్మి గెలిపించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఈ కూటమి కార్మికులకు అండగా ఉండాలని ఆర్టిసి కార్మిక సంఘ నాయకులకు శ్రీనివాస్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, మచ్చ రమేష్, ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి చీర్లవంచ శ్రీనివాస్, చైర్మన్ కె.తిరుపతి, అధ్యక్షులు రంగాచారి, టీఎంయూ అధ్యక్షులు కనకయ్య,కార్యదర్శి ఎం . ఆర్.రెడ్డి, చైర్మన్ ఎం.వి.ఆర్. రెడ్డి,నాయకులు బాకం ఆంజనేయులు , తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

