కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే రోజుల్లో ఖమ్మం రూరల్ మండల పరిధిలోని పోలేపల్లి (Polepally) గ్రామం రూపురేఖలు మారిపోనున్నాయని, గ్రామాభివృద్ధి కోసం రూ. 70 కోట్ల భారీ నిధులు వెచ్చిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం పోలేపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా రూ. 4.65 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రెండు నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రూ. 2.42 కోట్ల వ్యయంతో పోలేపల్లి నుండి దానవాయిగూడెం వయా మున్నేరు వరకు, అలాగే రూ. 2.20 కోట్ల వ్యయంతో పోలేపల్లి నుండి రామునిపేట వరకు నూతన బీటీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని చెబుతూ సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమల్లోకి తెచ్చామని అన్నారు. పోలేపల్లి గ్రామస్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కొద్ది రోజుల్లోనే నూతన రేషన్ డీలర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అదేవిధంగా అర్హులైన ప్రతి పేదవానికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో స్థల సమస్య ఉన్నందున, సమీపంలో అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధునిక వసతులతో నూతన స్కూల్ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, పీఆర్ ఈఈ మహేష్ బాబు, స్థానిక సర్పంచ్ బత్తిని మహేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : కాఫీ షాప్‌లో సీఎం విజయ్, రాహుల్ సందడి!
Follow Us On: Instagram

