కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలు, బీసీల రిజర్వేషన్ల (BC Reservations) అంశంపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. క్యాబినెట్ అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు, రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ నివేదికను అనుసరించి పక్కా లెక్కల ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. బీసీలు మొదటి నుంచి టీడీపీకి, ఎన్డీఏ కూటమికి వెన్నుముకగా నిలిచారని, వారికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. డెడికేటెడ్ కమిషన్ లెక్కల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించే స్థానాల వివరాలను మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మేయర్ సీట్లలో బీసీలకు 35.29 శాతం, మున్సిపల్ ఛైర్మన్లలో 33.02 శాతం, అర్బన్ వార్డులలో 32.78 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ వార్డులలో 26.73 శాతం, సర్పంచ్ స్థానాల్లో 27.95 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 25.55 శాతం, ఎంపీపీ పదవుల్లో 24.60 శాతం చొప్పున బీసీలకు ప్రాతినిధ్యం కల్పించనున్నారు.
న్యాయపరమైన పరిమితుల వల్ల చట్టబద్ధమైన రిజర్వేషన్ల శాతం తగ్గినప్పటికీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. పార్టీ పరంగా బీసీ అభ్యర్థులకు కనీసం 34 శాతానికి పైగా సీట్లను కేటాయించి, కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉందని, బీసీల సామాజిక, రాజకీయ సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

