కలం, వెబ్ డెస్క్ : నేమకల్లు హత్యాయత్నం కేసులో అయి, గత 70 రోజులుగా కర్నూలు జిల్లా కేంద్ర జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బి. విరూపాక్షి (MLA Virupakshi) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో, న్యాయపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం జైలు అధికారులు ఆయన్ని రిలీజ్ చేశారు. విరూపాక్షితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న 40 మందికి పైగా అనుచరులు, వైసీపీ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు.
ఆలూరు నియోజకవర్గంలోని నేమకల్లు గ్రామంలో జరిగిన రాజకీయ గొడవలు, ప్రత్యర్థులపై దాడి , హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన మద్దతుదారులపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసి కర్నూలు సబ్‌జైలుకు తరలించారు. అయితే ఇటీవల హైకోర్టు ధర్మాసనం నిందితులందరికీ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారందరూ బెయిల్ పై రిలీజ్ అయ్యారు.
కాగా, ఎమ్మెల్యే విరూపాక్షి విడుదల విషయం తెలిసిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున కర్నూలు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు కాంపౌండ్ బయటకు వచ్చిన ఆయనకు పూలమాలలు వేసి, నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన అభిమానులు, అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా ఆలూరు వైపు బయలుదేరారు.

