కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తగ్గితే కఠిన చర్యలు తప్పవని, నాణ్యతలో రాజీపడేదే లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) స్పష్టం చేశారు. ఖమ్మం నగర సమగ్ర పురోగతికి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. నగరంలోని 44వ డివిజన్ బాలాజీనగర్‌లో సుడా నిధులు రూ. 90 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శుక్రవారం కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలో రోడ్ల విస్తరణ పనులను ప్రజలను ఒప్పించి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజలు అంగీకరించని చోట ఎలాంటి బలవంతపు పనులు చేయడం లేదన్నారు. ఖమ్మం అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నిర్మాణ పనులన్నీ దీర్ఘకాలం మన్నికగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతోపాటు వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

