కలం, వెబ్‌డెస్క్: ఇండియా కూటమి (INDIA Bloc) అగ్రనేతలు నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) నేతృత్వంలో విపక్ష నేతలు రాష్ట్రపతికి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు, ఓటర్ల జాబితాల ట్యాంపరింగ్ ద్వారా వరుస ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు కుట్ర పన్నారని విపక్ష నేతలు వినతిపత్రంలో పేర్కొన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, సీఈసీ, ఈసీలకు జీవితకాల రక్షణ కల్పిస్తున్న 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సర్‌ను రద్దు చేసి, ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్లను వెంటనే పునరుద్ధరించాలని, ఈవీఎంల స్థానంలో తిరిగి పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకొని రావాలని కోరారు.
సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్ల చోరీకి సంబంధించి దేశమంతటా స్పష్టమైన ఆధారాలున్నాయని తెలిపారు. తాము సమర్పించిన వినతిపత్రంలోని అంశాలను రాష్ట్రపతి ఖండించలేదని, అయితే ఓట్ల చోరీకి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని ఆమె కోరినట్లు రాహుల్ వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు విజ్ఞప్తి చేశాయి.

