కలం, జోగులాంబ గద్వాల: సమాచార హక్కు చట్టం (RTI) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులో అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Collector Rizwanbasha Shaik) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్టీఐ వారోత్సవాలు–2026 సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేసిన ప్రసంగాన్ని గద్వాల ఐడీఓసీ సమావేశ మందిరంలో కలెక్టర్ వీడియో ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం జిల్లా అధికారులకు సమాచార హక్కు చట్టం అమలుపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాచార హక్కు అనేది కేవలం చట్టపరమైన విధానం మాత్రమే కాకుండా, ప్రభుత్వ వ్యవహారాలపై ప్రజలకు సమాచారం అందించే కీలక సాధనమని పేర్కొన్నారు. ఈ చట్టం పారదర్శక పాలనను బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు.
సమాచార హక్కు దరఖాస్తులను సక్రమంగా పరిశీలించి, దరఖాస్తుదారులకు ఖచ్చితమైన సమాచారాన్ని నిర్దేశిత గడువులోగా అందించాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా గ్రామ,మండల, డివిజన్,జిల్లా స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తులను ఎలా అందజేయాలి, ఎలాంటి సమాచారాన్ని అడగకూడదు అనే విషయాలపై ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రజలు అడిగిన దాని ప్రకారం ఆయా శాఖలలో ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం అధికారుల బాధ్యతగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధు మోహన్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, పిఐఓలు, ఏపీఐఓలు, తదితరులు పాల్గొన్నారు.

