కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో క్రమశిక్షణతో పైకి ఎదగాలని జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) ఆకాంక్షించారు. శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి.జానకి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ పరిస్థితులను చూసి నిరుత్సాహపడకుండా, అందుబాటులో ఉన్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకొని, ప్రాక్టికల్ శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారికి గర్వకారణంగా నిలవాలని, నిజాయితీ, మంచి నడవడిక, క్రమశిక్షణను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులకు తెలియజేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే ఆన్లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
అలాగే విద్యార్థులు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చెడు స్నేహాలకు లోనుకాకుండా తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం, సరఫరా, అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తు దెబ్బతినడంతో పాటు కుటుంబ గౌరవానికి కూడా భంగం కలుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి తమ కుటుంబానికి, కళాశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అనంతరం విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో రూపొందించిన సైబర్ నేరాల అవగాహన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ ప్రదర్శించారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ మున్సిఫల్ మేయర్ గుమ్మాల మమత, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపల్ జంగయ్య, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్లు, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, 1400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

