కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. బతుకమ్మ కానుకల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయంటూ ఆయన పోస్టులో రాసుకొచ్చారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, అలాగే కల్యాణలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన పేద యువతులకు పెళ్లి కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఈ హామీలను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు వెయ్యి రోజులు గడిచాక నిద్రలేచారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వందలాది హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, మిగిలిన 418 హామీల పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ పోస్టులో కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు.

