​ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందేనా!

కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సిందేనంటూ నిరుపేదలను బెదిరింపులకు దిగడం సరైంది కాదని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల పన్నుల డబ్బుతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర అధికార దుర్వినియోగం, రాజకీయ వివక్ష జరుగుతున్నాయని ఆరోపించారు.

​కాంగ్రెసేతర పార్టీల సర్పంచులు, ఇందిరమ్మ కమిటీలు నిబంధనల ప్రకారం ఇచ్చిన అర్హుల జాబితాలను మంత్రులు, అధికారులు పూర్తిగా బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శించారు. ఎదుళ్ల చెర్వు, ఎం. వెంకటాయపాలెం, కొదుమూరు, నేలకొండపల్లి, పాలేరు, మధిర తదితర ప్రాంతాల్లో సర్పంచులు ఇచ్చిన లిస్టుల్లో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం అన్యాయమన్నారు. ఎల్-1 కేటగిరీలోని అర్హులను పక్కనబెట్టి, ఎల్-2, ఎల్-3లోని కాంగ్రెస్ అనుచరులకు ఇళ్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు.

​గతంలో లాగానే గ్రామసభలు నిర్వహించి లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే బాధితులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు. కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) నాయకులు బండి రమేశ్, యర్రా శ్రీనివాసరావు, భూక్యా వీరభద్రం, మాదినేని రమేశ్, వై. విక్రమ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>