కలం, కరీంనగర్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కోరారు. మానవతా దృక్పథం, సేవాభావంతో ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియ ద్వారా నూతనంగా ఎన్నికైంది.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి వారిని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరిన్ని విస్తృత సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలిచి ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గంలో చైర్మన్ సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ పెండ్యాల కేశవరెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్ కుందారపు మహేశ్వర్, కోశాధికారి గోనె శ్రీనివాస్, యూత్ కోఆర్డినేటర్ మొగలోజు రాకేష్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా కోలా అన్నారెడ్డి, పెద్ది విద్యాసాగర్, చిదుర సురేష్, పి. శ్రీహరి రెడ్డి, రాగి శ్రీనివాస్, సాయిని నరేందర్, హనుమాండ్ల రాజిరెడ్డి, కానపర్తి మనోహర్ రావు, ఎలుగందల మునీందర్ ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీంధర్ సింగ్, టీఎన్జీఓల సంఘం కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు.

