కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జైలు గోడలనైనా బద్దలు కొడతామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన రైతులను మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి , బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు. ఇటీవల పంటలు ఎండిపోవడాని చూసి, ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని రైతులు జూరాల గేట్లను ఎత్తి నీటిని వదిలారు. ఈ విషయమై రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని సూచించారు. రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, రైతులకు క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రైతాంగం అనేక నిత్యం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ సమస్యలను చూశామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కరెంట్ పోయిందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఎందుకు విడుదల చేయలేదు? అంటూ నిలదీశారు. జూరాల నుంచి దిగువకు వెళ్లిన కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం ఎత్తుకెళ్తుందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు అందించకుండా, నీళ్లు వదులుకున్న మన రైతులపైనే కేసులు పెట్టడం దారుణం అన్నారు. రాష్ట్ర మంత్రులు వెళ్లి అడిగినా కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించలేకపోయారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

