పూల పండుగకు పూల కొరత.. మహిళలకు తిప్పలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ పండుగకు పూల కొరత (Bathukamma Flower Shortage) ఏర్పడింది. రాష్ట్ర ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు ఈ ఏడాది సందిగ్ధంలో పడ్డాయి. బతుకమ్మ ప్రజల జీవన విధానంలో మమేకమైన అతిపెద్ద పండుగ కావడంతో తెలంగాణలోని ప్రతి గ్రామంలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సంబరాలు నిర్వహిస్తుంటారు. బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వానికి, ప్రకృతి ఆరాధనకు నిలువుటద్దంలో నిలుస్తుందనలో ఎంత మాత్రం సందేహం లేదు. బతుకమ్మఅంటే బతుకును ఇచ్చే అమ్మ, లేదా జీవించే అమ్మ అని అర్థం. పూలను దేవతగా కొలిచే అరుదైన సంప్రదాయం ఈ పండుగ సొంతం. ఇది స్త్రీల పండుగగా ప్రసిద్ధి చెందినా, సామాజిక ఐక్యతకు దోహదపడుతుందని ప్రజలు భావిస్తారు.

తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్ర పండుగగా గుర్తింపు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక2014 నుంచి ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ప్రభుత్వం ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక పునరుజ్జీవనంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించింది. అందుకే ప్రభుత్వం దీనిని తెలంగాణ ‘బ్రాండ్ ఇమేజ్’గా ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో, గ్రామాల్లో బతుకమ్మ ఘాట్‌లను సుందరీకరించడం, విద్యుత్ దీపాలతో అలంకరించడం, నిమజ్జన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. పండుగ నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించి, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా జరిపించడం ఆనవాయితీ.

పూల పండుగకు ఎల్‌నినో ఎఫెక్ట్..

ఇది పూల పండుగ. వర్షాకాలం ముగిసి, శీతాకాలం ప్రారంభమయ్యే సమయాన, చెరువులన్నీ నిండి, రకరకాల అడవి పూలు వికసిస్తాయి. అయితే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా వర్షాభావ పరిస్థితుల్లో చెరువుల్లో నీళ్లు లేకపోవడం అడవిలో పూలు లేకపోవడం ఈ దఫా బతుకమ్మను పేర్చడానికి మహిళలకు ఇబ్బందిగా తయారైంది. తంగేడు (రాష్ట్ర పుష్పం), గునుగు, బంతి, చామంతి, కట్ల పూలు, రుద్రాక్ష పూలు వంటివాటిని సేకరించి బతుకమ్మను పేరుస్తారు. ఈ పూలలో ఔషధ గుణాలుంటాయి. వీటిని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులోని నీరు శుద్ధి అవుతుందని, క్రిమిసంహారకముగా పనిచేస్తుందని అనాదిగా వస్తున్న ఒక నమ్మకం.

తొమ్మిది రోజుల సంబరం..

బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య (ఎంగిలిపూల బతుకమ్మ) నాడు మొదలై, దుర్గాష్టమి (సద్దుల బతుకమ్మ) వరకు 9 రోజుల పాటు సాగుతుంది. ప్రతి రోజుకు ఒక ప్రత్యేక పేరు, నైవేద్యం ఉంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ రోజున నువ్వులు, బియ్యంపిండితో నైవేద్యం, అటుకుల బతుకమ్మ రోజున అటుకులు, బెల్లం, పప్పు తో నైవేద్యం,ముద్దపప్పు బతుకమ్మ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లం నైవేద్యాన్ని సమర్పిస్తారు. నానబియ్యం బతుకమ్మ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లంతో నైవేద్యం, అట్ల బతుకమ్మ రోజున అట్లు (దోశలు) తో నైవేద్యం, అలిగిన బతుకమ్మ రోజున నైవేద్యం ఉండదు, బతుకమ్మ అలిగిందని నమ్మకం.

వేపకాయల బతుకమ్మ రోజున సకినాల పిండిని వేపకాయల ఆకారంలో చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. వెన్నముద్దల బతుకమ్మ రోజున వెన్న, నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యం, సద్దుల బతుకమ్మ రోజున (సంబరాల ముగింపు రోజు) పెరుగన్నం, పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం వంటి 5 రకాల అన్నాలు (సద్దులు) నైవేద్యంగా సమర్పించి, భక్తిశ్రద్ధలతో బతుకమ్మను మొక్కుతారు. మహిళలందరూ పట్టుచీరలు ధరించి, బతుకమ్మలను మధ్యలో పెట్టి, చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో సఫలమైంది. ఇది కేవలం ఆచారమే కాదు, తెలంగాణ సామాజిక జీవన విధానం.

ఈ ఏడాది పూల కొరతతో మహిళలకు కొత్త చిక్కు

తెలంగాణ సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు నిలువుటద్దమైన బతుకమ్మ పండుగ ముంగిట్లోకి వచ్చిన వేళ, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన పూల కొరత జనానికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. పూల పండుగగా పిలిచే బతుకమ్మకు ఆయువుపట్టైన సాంప్రదాయ అడవి పూలు లభించడం ఈ ఏడాది గగనమే. బతుకమ్మ అనగానే మొదట గుర్తుకు వచ్చేవి తంగేడు, గునుగు పూలు. అయితే, ఈ ఏడాది వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల కారణంగా పల్లెల్లో సైతం తంగేడు పువ్వు కరువు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఊరి పొలిమేరల్లో, గుట్టల్లో ఉచితంగా, విరివిగా లభించిన ఈ అడవి పూలు ఇప్పుడు వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో బతుకమ్మను పేర్చేందుకు మహిళలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు దాపురించాయి.

గత ఏడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వేలకు పైగా ఎకరాల్లో సాగుచేసిన బంతి, చామంతి, మల్లెలు తదితరుల పూల సాగు ఏడాది సుమారు రెండువేల ఎకరాల్లో సాగు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో ఈ ఏడాది పూల పండుగకు పూల కొరత ఏర్పడింది. గత కొన్నేళ్లుగా సాగుతున్న విచ్చలవిడి పట్టణీకరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల పల్లెటూళ్ల చుట్టుపక్కల ఉండే ఖాళీ స్థలాలు, గుట్టలు మాయమవుతున్నాయి. గునుగు, తంగేడు వంటి మొక్కలు సహజసిద్ధంగా మొలిచే భూములు ప్లాట్లుగా మారడంతో, బతుకమ్మ పూల సహజ వనరులు క్రమంగా క్షీణించాయి.

మార్కెట్‌లోకి బంతి, చామంతి..

సాంప్రదాయ పూల కొరతను ఆసరాగా చేసుకుని మార్కెట్‌లోకి బంతి, చామంతి వంటి వాణిజ్య పూలు భారీగా వస్తున్నాయి. కొరత కారణంగా బంతి, చామంతి, గులాబీ పూల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్య మహిళలు బతుకమ్మను పేరుద్దామన్నా పూల బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. కొందరు వ్యాపారులు తెల్ల గునుగు పూలకు రంగులు అద్ది అమ్ముతున్నారు. ఇది పండుగ పవిత్రతను, సహజత్వాన్ని దెబ్బతీస్తోంది. బతుకమ్మ పూల నిమజ్జనానికి పర్యావరణపరంగా ఒక గొప్ప సైంటిఫిక్ కారణం ఉంది. తంగేడు, గునుగు పూలలో ఉండే ఔషధ గుణాలు నీటిని శుద్ధి చేస్తాయి.

అయితే ఈ ఏడాది సహజ సిద్ధమైన అడవి పూలకు బదులు, రసాయన ఎరువులు, పురుగుల మందులతో పండించిన హైబ్రిడ్ పూలను, రంగులు పూసిన గునుగు పూలను వాడటం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగను బ్రెజిల్ రియో కార్నివాల్ తరహాలో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. అయితే, పండుగకు మూలమైన పూల సంరక్షణపై కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

హరితహారం లేదా ఇతర పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో భాగంగా తంగేడు, గునుగు వంటి సాంప్రదాయ మొక్కలను ప్రభుత్వమే రోడ్ల ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో పెంచేలా చర్యలు తీసుకోవాలి. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్థానిక రైతులకు పూల సాగుపై సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తే ఈ కొరతను అధిగమించవచ్చు. పూల కొరత, ధరల భారం ఈ ఏడాది బతుకమ్మ ఉత్సాహాన్ని కాస్త తగ్గించినా, తెలంగాణ ఆడబిడ్డలు తమ అస్తిత్వ పండుగను అందుబాటులో ఉన్న వనరులతోనే భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ప్రకృతిని పూజించే ఈ పండుగను భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>