వనపర్తిలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మంది విద్యార్థినులకు అస్వస్థత!

కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. వనపర్తి (Wanaparthy) జిల్లా పెబ్బేరు శివారులో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో (Pebbair Polytechnic Hostel) రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థినులు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో హాస్టల్‌లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.

విద్యార్థినులు రాత్రి భోజనంలో చికెన్ తిన్న తర్వాత కడుపునొప్పి, ఇతర అస్వస్థత లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. నొప్పి తీవ్రతను తట్టుకోలేక పలువురు విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. పరిస్థితిని గమనించిన హాస్టల్ వార్డెన్ వెంటనే స్పందించి, బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

ఘటనపై పలు అనుమానాలు

విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనను కొందరు వైరల్ ఫీవర్‌గా పేర్కొంటూ అసలు విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.

విచారణ చేపట్టాలని డిమాండ్

ఒకేసారి ఇంతమంది విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి గల కారణాలపై తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజనం నాణ్యత, తాగునీటి పరిస్థితులు, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు. బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>