కలం, ఖమ్మం బ్యూరో: కళ్లారా చూసుకుంటూ, గుండెల్లో దాచుకున్న కంటిపాప కళ్లెదుటే నలిగిపోయిన హృదయవిదారక సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు అమ్మానాన్నల మధ్యన నవ్వుతూ సాగిన చిన్నారి ప్రయాణం.. క్షణాల్లో విషాదాంతమైంది. బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Khammam Accident) మూడేళ్ల పాప అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.
కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన జెట్టి అశోక్ దంపతులు తమ మూడేళ్ల కుమార్తెను ఇద్దరి మధ్యలో సురక్షితంగా కూర్చోబెట్టుకుని బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ (NTR Circle) వద్దకు రాగానే ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో బైక్ను నిలిపారు. కొద్దిసేపటి తర్వాత సిగ్నల్ పడటంతో అశోక్ బైక్ను ముందుకు మూవ్ చేశారు.
అయితే అంచనా తలకిందులై, బైక్ కదిలిన వేగానికి మధ్యలో కూర్చున్న చిన్నారి ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో సిగ్నల్ దాటేందుకు పక్కనే కదులుతున్న లారీ వెనుక టైర్ కింద పాప పడిపోవడంతో, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అప్పటివరకు తమ నడుమ గలగల ముచ్చటించిన చిన్నారి కళ్లముందే రక్తసిక్తమై శవంగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.
వారి ఆర్తనాదాలతో ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతం శోకసంద్రంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

