కలం, స్పోర్ట్స్: చైనా ఓపెన్‌లో యువ టెన్నిస్ స్టార్ నికోలా బార్టుంకోవా (Nikola Bartunkova) సరికొత్త సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సీనియర్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను ఓడించి, తన కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ 1000 సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. కేవలం 67 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 20 ఏళ్ల బార్టుంకోవా ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌ను 6-3తో గెలుచుకున్న ఆమె, రెండో సెట్లో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా 6-0తో ఏకపక్ష విజయం సాధించింది.
ఈ విజయంతో బార్టుంకోవా డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్-30లోకి అడుగుపెట్టడం ఖాయమైంది. అలాగే ఈ సీజన్లో టాప్-10 ర్యాంక్ క్రీడాకారిణిపై ఆమెకిది మూడో విజయం. తదుపరి మ్యాచ్‌లో మీరా ఆండ్రీవా లేదా ఎకాటెరినా అలెక్సాండ్రోవాతో బార్టుంకోవా తలపడనుంది. చైనా ఓపెన్‌లో ఆమె కనబరుస్తున్న అద్భుత ప్రదర్శన టెన్నిస్ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

