కలం, దేవరకొండ: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు మహిళా సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. చింతపల్లి (Chinthapally) మండలంలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. చింతపల్లి మండలం గోడుకొండ్ల, వి.టి.నగర్ గ్రామాల్లో వీబీజీరామ్‌జీ నిధుల నుంచి రూ. 10 లక్షల చొప్పున నిర్మించనున్న నూతన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలునాయక్ శంకుస్థాపన చేశారు.
గొల్లపల్లి గ్రామంలో వీబీజీరామ్‌జీ ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే (MLA Balu Naik) శ్రీకారం చుట్టారు. ధైర్యపురి తండాలో వీబీజీ రామ్‌జీ నిధులు రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మహిళలకు అప్పగించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు సొంత భవనాలు అందుబాటులోకి రావడం వల్ల పొదుపు సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకోవడం సులభతరమవుతుందన్నారు. మహిళలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు.
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో గ్రామాల్లో రహదారుల నిర్మాణ చేపడుతున్నామని బాలునాయక్ తెలిపారు. జిల్లా ప్రజలకు, రైతులు, విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను దశలవారీగా మెరుగుపరుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు దొంతం అలివేలు సంజీవరెడ్డి, జాటావత్ హరినాయక్, ముచర్ల గిరి, ఎరుకల వెంకటయ్య గౌడ్, కొండూరు పవన్ కుమార్, కాశగోని వెంకటయ్య, అనంతుల శ్రీను గౌడ్, వాంకుడోత్ అనిత, దాసు, అంగిరేకుల నాగభూషణం, వాంకుడోత్ రవి నాయక్, మాస భాస్కర్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, మార్కెట్ డైరెక్టర్లు, ఐకేపీ సెర్ప్ ప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

