మూడేండ్లలో రేవంత్ రూ.50 వేల కోట్లు స్వాహా చేశారు: ఆర్ఎస్ ప్రవీణ్

కలం, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పాలనలో అక్రమంగా రూ. 50,000 కోట్లు సంపాదించారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ప్రజల సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాలకు, వ్యాపారాలకు మళ్లించుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు కుమ్మరించినా రాబోయే నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు.

భూపాల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం..

నల్గొండ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) అధ్యక్షతన జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభకు (Nalgonda BRS Meeting) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట కంపెనీలు, సంస్థలు ఏర్పాటు చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.

రేవంత్ భార్య పేరుమీద షోరూమ్..

కేసీఆర్ హయాంలో పేద ఎస్సీ వర్గాలు ఆర్థికంగా ఎదుగాలని ‘దళిత బంధు’ ఇచ్చి యజమానులను చేస్తే, రేవంత్ రెడ్డి మాత్రం తన సతీమణి గీతారెడ్డి పేరు మీద ‘గీతా హ్యుందాయ్’ షోరూమ్‌లు తెరిచారని విమర్శించారు. గత ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తే, రేవంత్ రెడ్డి తన కుమార్తె పేరిట ‘మైండ్ వాల్ట్’ సంస్థ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఖరీదైన అంతర్జాతీయ పాఠశాలలను నిర్మిస్తున్నారని ఆరోపించారు.

రూ. 3,200 కోట్లకు విక్రయించారు..

జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులను పక్కనపెట్టి, తన అల్లుడు డైరెక్టర్‌గా ఉన్న ‘మెడికవర్’ ఆసుపత్రిని స్వయంగా ప్రమోట్ చేసి రూ. 3,200 కోట్లకు విక్రయించారని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అందాల్సిన రూ. 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా ఎగవేసిందని అన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నీరుగార్చి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.

అనుచరుడికి టెండర్లు..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కమీషన్ల కోసం నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లను పక్కనపెట్టి, తమ అనుచరుడైన పృథ్వీరెడ్డికి టెండర్లు కట్టబెడుతున్నారని ఆర్ఎస్పీ ఆరోపించారు. రేవంత్ రెడ్డి కమీషన్ల ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్స్ లాంటివని, ఇందులో గెలిచి సెమీస్, ఫైనల్స్ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. బిట్స్ పిలానీలో చదివి, విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మేధావి డాక్టర్ ఏనుగుల రాకేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టాలని శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పట్టభద్రులు పాల్గొన్నారు.

Also Read : డీప్ ఫేక్‌, సైబ‌ర్ మోసాల‌పై మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>