కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టుపరిశ్రమ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని అనంత మారుతి ఫంక్షన్ హాల్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కిసాన్ మేళాలో(Kisan Mela) ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా లు పాల్గొన్నారు.
తొలుత ఆయన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలిసి కిసాన్ మేళా(Kisan Mela)ను ప్రారంభించి అనంతరం వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, సాంకేతిక పరికరాల స్టాళ్లను పరిశీలించారు. దేశానికి రైతే వెన్నెముక అన్నారు. కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, పొలాలకు వెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. యాప్‌లు, కార్యాలయాలకే పరిమితం కాకుండా రైతులతో నేరుగా మాట్లాడాలని కోరారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు బోనస్ వంటి కార్యక్రమాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. పెరుగుతున్న పెట్టుబడి, కూలీల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులకు లాభదాయకమైన మద్దతు ధరలు లభించేలా చర్యలు అవసరమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వరి, పత్తితో పాటు ఉద్యాన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. గతంలో జిల్లాలో సాగు చేసిన కంది, సజ్జలు, జొన్నలు, వేరుశనగ వంటి పంటలను తిరిగి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులు సంఘటితమైతే దళారుల దోపిడీని అరికట్టవచ్చని, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను (ఎఫ్.పి.ఓ ) మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎఫ్.పి.ఓల ద్వారా రైతులు పంటలను నేరుగా మార్కెట్ చేసుకునేలా, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతులకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు సేంద్రియ పంటలకు ధ్రువీకరణ, ప్రత్యేక మార్కెట్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు అవసరమైన చోట మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని, కల్తీ విత్తనాల సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కరోనా సమయంలోనూ రైతులు ప్రజలకు ఆహారం, కూరగాయలు, పండ్లు అందించేందుకు విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆధునిక సాగుతోనే రైతులకు భరోసా
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పంటలు సాగు చేసినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి కార్యక్రమాలతో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
సంప్రదాయ వరి సాగుకే పరిమితం కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్‌పామ్ వంటి వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ అధికారులు సూచించే ఆధునిక యాజమాన్య పద్ధతులు, యంత్రాల వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, ఆధునిక సాగు విధానాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లేందుకు కిసాన్ మేళాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపికపై దృష్టి పెట్టాలి
వాతావరణ మార్పులు, అనిశ్చిత వర్షపాతం నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుతో అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. కిసాన్ మేళాలో మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఏపంట, ఏవిత్తన రకం, ఎంత నీటితో సాగు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందనే అంశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు.
ఆపరిశోధనల ఆధారంగా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకే కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లను రైతులు సందర్శించి నూతన విత్తన రకాలు, ఆధునిక సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం, దిగుబడులు, లాభదాయకమైన పంటలపై అవగాహన పొందాలని సూచించారు. భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు.
రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు కూడా ఎంతో విలువైనవని పేర్కొంటూ, పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఫామ్ పాండ్లలో చేపల పెంపకం వంటి విధానాలతో అదనపు ఆదాయం పొందుతున్న రైతుల విజయాలను ఇతర రైతులతో పంచుకోవాలని సూచించారు. భూత్పూర్ ప్రాంతంలో కొందరు రైతులు పంట మార్పిడి ద్వారా వరితో పోలిస్తే కూరగాయల సాగులో అధిక లాభాలు పొందుతున్నారని, ఫామ్ పాండ్ల ద్వారా చేపల పెంపకంతో అదనపు ఆదాయం పొందుతున్నారని ఉదాహరణగా తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలని సూచించారు. కిసాన్ మేళా(Kisan Mela)లో రైతులు శాస్త్రవేత్తలను సంప్రదించి పంటల ఎంపిక, తక్కువ నీటితో సాగు, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తన రకాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశువైద్య, పశుసంవర్ధక శాఖ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, ఇస్కో తదితర సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్ పరిశీలించి, ప్రదర్శించిన వ్యవసాయ ఉత్పత్తులు, యంత్రాలు, పనిముట్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శివానంద స్వామి, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Also Read : తిరుమలలో దారి అడిగే పని ఇక లేదు.. భక్తుల కోసం TTD కొత్త యాప్ ఇదే!
Follow Us On: Youtube

