సిద్దిపేటలో కోనోకార్పస్‌తో కోట్ల నష్టం..

క‌లం మెద‌క్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హరితహారం కార్యక్రమం కింద నాటిన కోనోకార్పస్ చెట్ల (Conocarpus Trees) కొట్టివేతపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్దిపేటలో ప్రజాధనానికి రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. పాలకులు శాస్త్రీయ ఆలోచన చేయకుండా, స‌రైన అవ‌గాహ‌న‌ లేకుండా కోనో కార్పస్ చెట్లను నాటి ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అవ‌గాహ‌న లేమి, అధికారుల ప్రణాళిక‌ లోపంతో వేలాది కోనో కార్పస్ చెట్లను న‌రికివేత అనివార్యంగా మార్చింది. దీంతో ప్రజాధ‌నం వృథా అవ‌డ‌మే కాకుండా, ప్రజారోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యత దెబ్బతినే ప‌రిస్థితి నెల‌కొంది.

ఎటూ చూసిన‌ అవే..

సిద్దిపేట‌ టౌన్ లో సుందరీకరణ కోసం రోడ్లకు ఇరువైపులా, డివైడర్ల మధ్యలో కోనోకార్పస్ మెుక్కలను నాటారు. స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావు హ‌రిత‌హారం పైన ప్రత్యేక శ్రద్ధ చూపి ప‌చ్చద‌నం క‌న్పించే విధంగా నాటించారు. ఆలోచ‌న మంచిదైనా, కానీ కోనో కార్పస్ చెట్ల పెంపకంపై అవ‌గాహ‌న లేక‌పోవడమో లేక త్వర‌గా పెరుగుతాయని, నిర్వహ‌ణ త‌క్కువ ఉంటుంద‌నే కోణంలోనో వేలాది మొక్కలను నాటి సంర‌క్షించారు.

టౌన్ లోని పాత బస్టాండ్ నుంచి క‌రీంన‌గ‌ర్ వైపు, మెద‌క్ వైపు, ప్రభుత్వ ఆస్పత్రి స‌ర్కిల్, వేంక‌టేశ్వర ఆల‌యం, కోర్టు రోడ్డు, విక్టరీ టాకీస్ రోడ్డు.. ఇలా ప్రధాన రోడ్ల వెంట వేలల్లో కోనోకార్పస్ మొక్కలను పెంచారు. రోడ్లకు ఇరువైపులా, డివైడ‌ర్ల మధ్యలో నాటడంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో పట్టణం కళకళలాడుతుంది. అయితే మెుక్కలు బాగా పెరిగాయ‌ని అనుకునే స‌మ‌యానికి కోనో కార్పస్ చెట్లతో ప్రజల‌కు ఆరోగ్య సమస్యలతోపాటు పర్యావరణానికి ముప్పు వస్తాయని తేలింది.

చెట్లతో నష్టాలు ఇలా..

చెట్లు పూత పూసే సమయంలో గాలిలోకి విడుదలయ్యే పరాగరేణువులు తీవ్రమైన అలర్జీలకు కారణమవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు, దగ్గు, కంటి, ముక్కు అలర్జీలు పెరుగుతాయి. కోనోకార్పస్ మెుక్కలతో ఊపిరితిత్తులు, చ‌ర్మంపై ప్రభావం ప‌డే ప్రమాదం ఉందని , చెట్ల ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రజ‌ల‌కు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

కోనోకార్పస్ తో పర్యావరణ, ఆరోగ్య సమస్యలతో పాటు మెుక్క వేర్లు బలంగా భూమిలోపలికి చొచ్చుకెళ్లి భూగర్భ జలాలను ఎక్కువగా వాడుకొని నష్టం కలిగిస్తుందని గుర్తించారు. ఇవి ఆకర్షణీయంగా మాత్రమే ఉంటాయని, ఎలాంటి ఉపయోగం లేదని , చెట్లపైన‌ పక్షులు కూడా గూడు నిర్మించుకోలేవని , జీవ వైవిధ్యం దెబ్బతింటుంద‌ని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ, వృక్షశాస్త్ర నిపుణుల నుంచి వ‌స్తున్న అభ్యంత‌రాలు,ప్రజ‌ల ఆరోగ్యం కోణంలో భ‌విష్యత్తు స‌మ‌స్యలు లేకుండా, కోనోకార్పస్ తో దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది.

హై కోర్టు తీర్పుతో..

కోనో కార్పస్ చెట్లతో ప్రజారోగ్యానికి కలిగే ముప్పును నివారించేందుకు తొలగించి, వాటి స్థానంలో ఆరోగ్యకరమైన చెట్లను నాటాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన‌ చక్రధర్ గౌడ్ అటవీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, కలెక్టర్ కు వినతిపత్రాలు అందజేశారు. అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, పిటిషనర్ చ‌క్రధర్ గౌడ్ వాదనలతో ఏకీభవించి నాలుగు వారాల్లో సిద్దిపేట మున్సిపాలిటీలోని కోనో కార్పస్ చెట్లను తొలగించాలని ఆదేశించింది. ప్రభుత్వం నిషేధం విధించిన త‌ర్వాత కొన్ని చోట్ల చెట్ల నరికివేసినప్పటికీ తిరిగి మ‌ళ్లీ పెరిగి,పెద్దగా ఏపుగా పెరిగాయ‌ని స్థానికులు చెబుతున్నారు. టౌన్ లో ఎక్కడ‌ చూసినా క‌న్పించే కోనోకార్పస్ మొక్కలతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా పూర్తి స్థాయిలో చెట్లను తొలగించాలని కోరుతున్నారు. ప్రజ‌లకు ఉప‌యోగ‌ప‌డే చెట్లను పెంచాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>