బైక్‌ల‌ చోరీ ముఠా గుట్టురట్టు.. న‌లుగురు అరెస్ట్‌

కలం, కరీంనగర్: కరీంనగర్ (​Karimnagar) నగరంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీ కేసులను కరీంనగర్-II టౌన్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. బుధ‌వారం కరీంనగర్-II టౌన్ పోలీసులు పద్మానగర్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పింగిలి విజేందర్ రెడ్డి (33, A-1), కాదరి స్వామి (27, A-2)లను అదుపులోకి తీసుకుని విచారించారు.

​విచారణలో A-1 (విజేందర్ రెడ్డి) గత కొంతకాలంగా కరీంనగర్, LMD, వేములవాడ తదితర ప్రాంతాల్లో తాళాలు పగులగొట్టి, నకిలీ తాళాలు (ఫాల్స్ కీ) ఉపయోగించి సుమారు 39 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఆ వాహనాలను A-2 (కాదరి స్వామి)కి విక్రయించగా, అతను చోరీ వాహనాలని తెలిసినప్పటికీ కొనుగోలు చేసి, కొన్నింటిని స్క్రాప్‌గా మార్చడంతో పాటు మరికొన్నింటిని ఇతర స్క్రాప్ వ్యాపారులకు విక్రయించినట్లు తేలింది.
​
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి ​A-1 వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలు, ​A-2 వద్ద నుంచి 05 ద్విచక్ర వాహనాలు, ​స్క్రాప్ వ్యాపారులైన షేక్ ముబీన్ హుస్సేన్ (33, A-3), సయ్యద్ అబ్దుల్ హమీద్ (38, A-4)ల వద్ద నుంచి చెరో 02 (మొత్తం 3) ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ​ఈ నిందితులకు కరీంనగర్-I టౌన్, II టౌన్, III టౌన్, LMD, వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోరీ కేసులతో ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాహనదారులు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేసి, తప్పనిసరిగా తాళాలు వేసుకోవాలని కరీంనగర్-II టౌన్ పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ​ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఇన్స్పెక్టర్ శ్రీ కె. సృజన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు ఎ. శ్రీనాథ్, పి. శ్రీనివాస్ రావు, క్రైమ్ పార్టీ సిబ్బంది, రైటర్స్ టీమ్‌ను కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకంగా అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>