కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం పట్టణ పరిధిలో జీవో 76 పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి, రాబోయే రెండు నెలల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తెలిపారు. బుధవారం ఆయన నగరంలోని వివిధ డివిజన్లలో రూ.1.69 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్లు, డ్రైన్లు, బతుకమ్మ ఘాట్ పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు రూ.30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో 76 కింద వచ్చిన 2,241 దరఖాస్తుల్లో 1,420 పరిశీలన పూర్తయిందని, ఇందులో 150 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన 821 దరఖాస్తుల పరిశీలనకు ఆరుగురు తహసీల్దార్ల నేతృత్వంలో ప్రత్యేక బృందాలు సర్వే చేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రక్రియలో లంచాలు డిమాండ్ చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, అవినీతికి తావులేకుండా నాణ్యమైన అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

