కలం, యాదగిరిగుట్ట: సమాజంలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం ఉపాధ్యాయులదేనని, వారు అందించే విద్యాబుద్ధులు, క్రమశిక్షణ, నైతిక విలువలే విద్యార్థులను భావి భారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (MLA Beerla Ilaiah) అన్నారు. బుధవారం యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గొట్టిపర్తి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆచార్య దేవోభవ’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఉత్తమ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ‘ఆచార్య దేవోభవ’ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. తన ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలే తనను నేడు ఎమ్మెల్యే స్థాయికి తీసుకువచ్చాయని గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో స్వార్థానికి తావు లేదని, సొంత పిల్లల భవిష్యత్తు పట్ల ఎంత శ్రద్ధ చూపుతారో అంతకంటే ఎక్కువగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు శ్రమిస్తారని కొనియాడారు. తల్లిదండ్రులు విద్యార్థులకు జన్మనిస్తే, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమాజానికి వెలుగునిచ్చే బాధ్యతను గురువులు నిర్వర్తిస్తారని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఆనందించే వ్యక్తులు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు ‘Tr.’ హోదా కోసం సీఎం దృష్టికి తీసుకెళ్తా
కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ ఉపాధ్యాయులకు గౌరవ హోదా కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. వైద్యులకు పేరు ముందు ‘డాక్టర్ (Dr.)’ అనే గౌరవ హోదా ఉన్నట్లే, ఉపాధ్యాయులకు కూడా ‘టీచర్ (Tr.)’ హోదా కల్పించే విధానాన్ని కర్ణాటకలో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోనూ ఉపాధ్యాయులకు ఇలాంటి గౌరవాన్ని కల్పించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అమలు కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. యువత చెడు వ్యసనాలు, మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలు, ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

