మహబూబ్‌నగర్‌కు తలమానికంగా మినీ ట్యాంక్‌బండ్: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌న‌గ‌ర్ బ్యూరో: దసరా సెలవుల్లో నగరవాసులు కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు మహబూబ్‌నగర్ (Mahabubnagar) మినీ ట్యాంక్‌బండ్‌పై ఆధునిక వసతులతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సుందరీకరణ పనులు, నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ప్లే ఏరియాను ఆయన జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర ప్రజలకు ఉదయం, సాయంత్రం వాకింగ్, యోగా, సామాజిక సమావేశాల కోసం ప్రశాంతమైన వాతావరణం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

అధికారులు, సిబ్బందికి ప్ర‌శంస‌లు..

ట్యాంక్‌బండ్ పరిసరాల్లో అధునాతన పార్కులు, పిల్లల ఆట పరికరాలు, రమణీయమైన లైటింగ్ వంటి మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. దసరా పండుగ సెలవులు ప్రారంభమయ్యే నాటికే పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అహర్నిశలు శ్రమించారని ప్రశంసించారు. ట్యాంక్‌బండ్ సుందరీకరణ ఇది తొలి దశ మాత్రమేనని, రానున్న రోజుల్లో ఆనుకుని ఉన్న ఇతర పరిసరాలను సైతం మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ నగరానికి ఈ ప్రాంతాన్ని తలమానికంగా నిలిపి, ప్రజలందరూ గర్వపడేలా తీర్చిదిద్దడమే తమ సంకల్పమన్నారు. ఈ ప్రాజెక్టుకు ముడా చైర్మన్ తన నిధుల నుంచి కేటాయింపులు చేసి సహకరించారని తెలిపారు. పచ్చదనం నిరంతరం కళకళలాడేందుకు డ్రిప్, వాటర్ స్ప్రే వంటి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు.

ప‌రిశుభ్రంగా కాపాడుకోవాలి..

ఎంతో వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిశుభ్రంగా కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పార్కులో ఎలాంటి అవాంఛనీయ, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలని, మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం, సెక్యూరిటీ కోసం ప్రత్యేక సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. అనంతరం ట్యాంక్‌బండ్ సమీపంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన చేతివృత్తుల విక్రయ కేంద్రాలను ఆయన ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేశారు. సెలవుల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో సందర్శించి ఈ సౌకర్యాలను ఆస్వాదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, సోషల్ మీడియా కన్వీనర్ సిజే బెనహర్, స్థానిక కార్పొరేటర్ జాహీర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవేజ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలీ, నాయకులు ఫయాజ్, మైత్రి యాదయ్య, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>