కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల (Municipal Workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలోని సిపిఐ కార్యాలయంలో పేరబోయిన స్వామి అధ్యక్షతన మున్సిపల్ కార్మికుల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జైపాల్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అయితే వారి హక్కులు, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు.
కార్మికులకు వారానికి ఒకరోజు వీక్లీ ఆఫ్, క్యాజువల్ లీవ్స్తో పాటు పండుగ, జాతీయ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26 వేలుగా చెల్లించాలని కోరారు. దీర్ఘకాలంగా మున్సిపల్ సేవల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టబద్ధంగా లభించాల్సిన సెలవులు, వేతనాలు, ఇతర హక్కులను అమలు చేయాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై అధికారులు సానుకూలంగా స్పందించకపోతే యూనియన్ ఆధ్వర్యంలో తదుపరి కార్యాచరణ చేపడతామని జైపాల్ రెడ్డి హెచ్చరించారు. అనంతరం కార్మికుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ మేనేజర్ సుమిత్రకు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోదా శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ పట్టణ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి గోపగాని రాజు, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు గడిపే జహంగీర్, గ్యాదపాక స్వామి, గోపి, జయమ్మ, అయిలమ్మ, సుధ, అయ్యం, గ్యాదపాక హరిబాబు, కలమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

