రైతుల సమక్షంలోనే రీ-సర్వే.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, లక్ష్మణచందా : లక్ష్మణచందా (Laxmanchanda) మండలం న్యూ కంజర్, చామన్‌పల్లి (Chamanpalli) గ్రామాల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం పర్యటించి భూ సమస్యలు, రీ-సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. ముందుగా న్యూ కంజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు, గ్రామస్తులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో భూముల పట్టాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో గ్రామస్తుల సహకారం కీలకమని పేర్కొన్నారు.

భూ సమస్యలపై గ్రామసభలు నిర్వహించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భూముల పట్టాలకు సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే గ్రామసభల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. గ్రామస్తుల సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు చొరవతో పరిష్కరించాలని ఆదేశించారు.

అనంతరం చామన్‌పల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీ-సర్వే పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలి ఉన్న కమతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రీ-సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వేలో పూర్తి పారదర్శకత పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

సర్వే బృందం సిబ్బంది పర్యవేక్షణలో, సంబంధిత భూ కమతాల రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఆర్డీవో దేవీదాస్, ఏడీ ల్యాండ్ సర్వే రికార్డ్స్ విఠల్, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో వనజ, సర్పంచ్‌లు మోహన్‌రెడ్డి, లక్ష్మి, ఉప సర్పంచ్‌లు ముత్యం, గంగారెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>