సినిమా స్టైల్‌లో దొంగతనం.. ఏకంగా ఏటీఎంనే లాక్కెళ్లిన దొంగలు!

కలం, వెబ్ డెస్క్ : ఇటీవల కాలంలో దొంగల ముఠా ఏటీఎమ్ లే లక్ష్యంగా చోరీకి పాల్పడుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే సినిమా స్టైల్ లో ప్లాన్ చేసి, ఏటీఎం మిషన్‌నే అపహరించుకుపోయిన విస్తుపోయే సంఘటన జార్ఖండ్‌లోని (Jharkhand ATM) దేవ్‌ఘర్ నగరంలో వెలుగుచూసింది. నందన్ పహాడ్ ప్రాంతంలోని ‘సేవా ధామ్’ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ఏటీఎంలో డబ్బులు తీయడం సాధ్యపడకపోవడంతో, దుండగులు ఏకంగా మిషన్‌ను పెకలించి పట్టుకెళ్లారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 3:30 గంటల సమయంలో ముఖాలకు మాస్కులు ధరించిన దాదాపు 7 మంది దొంగల ముఠా ఏటీఎం కేంద్రానికి చేరుకుంది. ముందుగా షట్టర్‌ను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన వారు, గ్యాస్ కట్టర్ల సాయంతో ఏటీఎం మిషన్‌ను బేస్ నుంచి కట్ చేశారు. అనంతరం మిషన్‌కు తాడు కట్టి, రోడ్డుపై దాదాపు 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లారు. అక్కడ ముందే సిద్ధంగా ఉంచుకున్న ఒక కారు డిక్కీలో దాన్ని ఎక్కించుకుని వారంతా పరారయ్యారు.

ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలన చేశారు. సీసీటీవీ దృశ్యాలను గమనించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటన సమయంలో ఏటీఎంలో సుమారు రూ. 4.82 లక్షల నగదు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో దొంగల ముఠా ఈ చోరీకి యత్నించిందని తేల్చారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>