ఎర్రవల్లి భూముల గుట్టు: ఆ 45 ఎకరాలు ఏమైనట్టు?

కలం, తెలంగాణ బ్యూరో: ఎర్రవల్లి భూముల వ్యవహారం (Erravalli Land Survey) కీలక మలుపు తిరిగింది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 325లో మొత్తం 388 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉండగా, అందులో 45 ఎకరాలు మిస్ అయినట్టు సర్వేలో తేలింది. ప్రస్తుతం 343 ఎకరాలే ఉన్నట్టు వెల్లడైంది. మరి ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉన్నది? కబ్జా చేసిందెవరు? కబ్జా చేసినట్టు తేలితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది కీలకంగా మారింది.

ఎర్రవల్లి భూముల రిపోర్టు ప్రభుత్వానికి చేరడం.. మిస్ అయిన 45 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదో గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. ఇందులో భాగంగా ఫామ్‌హౌస్ సహా ఇతర భూముల రికార్డులను సమర్పించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకూ నోటీసులు ఇవ్వనున్నది.

మిస్ అయిన 45 ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ భూమిని అర్హులైన స్థానిక రైతులకు, తెలంగాణ ఉద్యమ అమరుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. అమరుల కుటుంబ సభ్యులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని సౌకర్యాలతో అమరవీరుల కాలనీ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 325లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 388 ఎకరాలు ఉంటే, క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాత 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. మిగిలిన 45 ఎకరాలు మిస్సింగ్‌ అయినట్టు గుర్తించారు. ఆ సర్వే నెంబర్ రికార్డులు, సర్వే రిపోర్టు, రైతుల ఆధీనంలో ఉన్న భూముల వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్‌‌కు ఇటీవల అందజేశారు. ఇప్పుడా రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డికి చేరింది.

దీంతో మిస్ అయిన 45 ఎకరాల భూమి ఎక్కడున్నదో గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇందుకోసం రెవెన్యూ డిపార్టుమెంట్ ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325కు ఆనుకుని కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సహా కొన్ని భూములు ఉన్నందున వారి భూములకు సంబంధించిన రికార్డులను సమర్పించాల్సిందిగా ఆదేశించనున్నారు.

మిస్సింగ్‌ భూములతో కేసీఆర్‌కు లింక్?

అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఎర్రవల్లిలోని 325 సర్వే నెంబర్‌ను ప్రస్తావించి.. అందులో 388 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదని, అది ఫామ్‌హౌస్ పరిధిలోకి వెళ్లిందో? లేదో? తేల్చాలని రెవెన్యూ శాఖను, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఎంత భూమి కొనుగోలు చేశారు? ఎంత భూమి ప్రభుత్వానికి చెందింది? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది?.. ఇలాంటి వివరాలను నిర్ధారించాలని స్పష్టం చేశారు.

మొత్తం విచారణను 30 రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించారు. శాటిలైట్, డిజిటల్ సర్వే ద్వారా ఫామ్‌హౌస్‌కు సమీపంలోని భూముల పరిస్థితిని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. రికార్డుల్లో నమోదైన రైతులకు మర్కూక్ తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఏ రైతు ఆధీనంలో ఎంత భూమి ఉన్నదో, వారి దగ్గర ఉన్న రికార్డుల్లో ఏమున్నదో పరిశీలించిన అధికారులు.. ఆయా రైతుల దగ్గర ఉన్న భూముల హద్దులు, లేటెస్ట్ ఫిజికల్ స్టేటస్, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలు, అనుభవదారులు.. ఇలాంటి అన్ని వివరాలతో నివేదికను రూపొందించి కలెక్టర్‌కు అందజేశారు.

అది తాజాగా ప్రభుత్వానికి చేరడంతో మిస్ అయిన 45 ఎకరాలను తేల్చాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో మిస్ అయిన 45 ఎకరాల భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదో తేలితే దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందో, కబ్జా చేసినట్లు నిర్ధారణ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందోననే చర్చలు మొదలయ్యాయి.

అమరవీరుల కాలనీ నిర్మాణం

ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై మంగళవారం రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ రెండు గ్రామాల్లోని సర్వే వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. సర్వే నెంబర్‌ 325లో 45 ఎకరాలు మిస్ అయినట్లు తెలియజేయడంతో ఎక్కడున్నదో గుర్తించాలని ఆదేశించారు. సర్వే నంబర్ 325లో ఉన్న భూమిని అర్హులైన స్థానిక రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనున్నది.

తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ డిపార్టుమెంటుకు అప్పగించాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు.

ఎర్రవల్లి భూముల వివాదం మొదలైందిలా..

• సెప్టెంబరు 16: నిషేధిత భూముల జాబితా (22-ఏ) అంశంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో ఉన్న 388 ఎకరాల భూములపై సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు సీఎం ఆదేశం.

• సెప్టెంబరు 17 : సీఎం ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, సిద్దిపేట జిల్లా ల్యాండ్ అండ్ రికార్డ్స్ ఏడీ సుదర్శన్. తహసీల్దార్ కార్యాలయంలో పాత రెవెన్యూ రికార్డుల పరిశీలన.

• సెప్టెంబర్ 18 : జిల్లా సర్వే డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో బౌండరీ, కోఆర్డినేట్ల నిర్ధారణ కోసం డిజిటల్ జీపీఎస్ ఆధారిత సర్వే ప్రారంభం.

• సెప్టెంబరు 19 : ఆ సర్వే నెంబర్‌లో మొత్తం 388.5 ఎకరాల బౌండరీ నిర్ధారణ, మ్యాపింగ్ పనులతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రైతులకు నోటీసులిచ్చే ప్రక్రియ ప్రారంభం.

• సెప్టెంబరు 20 : ఆ సర్వే నెంబర్‌లో ఉన్న భూములు, వాటిని సాగుచేస్తున్న రైతులు, వారిని గుర్తించే ప్రక్రియ కోసం నోటీసుల ప్రక్రియ కంటిన్యూ.
• సెప్టెంబరు 21 : నాలుగు బృందాలుగా విడిపోయిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది. అనుభవంలో ఉన్న, రికార్డుల్లో ఉన్న రైతుల వివరాల ఆధారంగా ఫిజికల్ సర్వే ప్రారంభం.

• సెప్టెంబరు 22-25 : ప్రస్తుతం భౌతికంగా ఉన్న భూమి, రికార్డుల్లోని విస్తీర్ణం, వాటి హద్దులు, ఇప్పటివరకు జారీ అయిన పట్టాలు, వాటి ఆధారాలను సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు రైతుల పేర్లవారీగా పరిశీలించారు.

• సెప్టెంబరు 26 : సర్వే నెంబర్ 325లోని మొత్తం 388 ఎకరాల్లో ప్రస్తుతమున్న భూముల సర్వే ప్రక్రియ కంప్లీట్. భూముల హద్దులు, వారి పొసెషన్ వివరాల నమోదు.

• సెప్టెంబరు 27-30 : రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు నిర్వహించిన సర్వేకు అనుగుణంగా ఫీల్డులో వచ్చిన వివరాలు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్నవాటితో పోల్చి నివేదికను రూపొందించే ప్రక్రియ పూర్తి.

• అక్టోబరు 1 : రెవెన్యూ ఆఫీసర్లు, సిబ్బంది, సర్వేయర్లు కలిసి ఫిజికల్ కోఆర్డినేషన్ల నిర్ధారణ, రికార్డుల వెరిఫికేషన్, లేటెస్ట్ స్టేటస్, రైతుల ఆధీనంలో ఉన్న భూమి, లెక్కల్లోకి రాని (మిస్సింగ్) భూమి.. ఈ వివరాల నివేదిక కలెక్టర్‌కు అందించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం.

• అక్టోబర్ 6 : జిల్లా కలెక్టర్ పరిశీలన అనంతరం సర్వే నెంబర్ 325లో రికార్డుల్లో ఎంత భూమి ఉన్నది, ప్రస్తుతం సర్వేలో ఎంత తేలింది, మొత్తం మిస్ అయింది ఎంత.. ఈ వివరాలను పేర్కొంటూ ముఖ్యమంత్రికి చేరిన నివేదిక.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>