కలం, కరీంనగర్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Indian Red Cross Society) కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులుకు ఎన్నికల ద్వారా ఎంపికైంది. డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో చైర్మన్‌గా సంగెం లక్ష్మణరావు, వైస్ చైర్మన్‌గా వుట్కురి రాధాకృష్ణారెడ్డి, చీఫ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా పెండ్యాల కేశవరెడ్డి, స్టేట్ ఈసీ మెంబర్‌గా కుందారపు మహేశ్వర్, కోశాధికారిగా గోనె శ్రీనివాస్ యుత్ కోఆర్డినేటర్ గా మొగలోజు రాకేష్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులుగా కోల అన్నారెడ్డి, పెద్ది విద్యాసాగర్, చిదుర సురేష్, పి.శ్రీహరి రెడ్డి, రాగి శ్రీనివాస్, సాయిని నరేందర్, హనుమాండ్ల రాజిరెడ్డి, కాన్పర్తి మనోహర్ రావు, ఎలుగందల మునీందర్ ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో విజయం సాధించిన నూతన జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్, జిల్లా టిజీఓల అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంలను వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్, సీపీకి పూల బొకేలు, స్వీట్లు అందించి నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన విషయాన్ని తెలియజేస్తూ, నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ, డీఆర్ఓలను కూడా నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి తమ కార్యవర్గాన్ని పరిచయం చేసుకున్నారు.
నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సంగెం లక్ష్మణరావు మాట్లాడుతూ.. తమ ఎన్నికలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ తో పాటు ఉద్యోగ జేఏసీ నాయకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. అన్ని శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, జిల్లా అధికారులు తదితరులను సమన్వయం చేస్తూ ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నాయకులు కృషి చేశారని, తమ విజయానికి వారు వెన్నెముకగా నిలిచారని పేర్కొన్నారు.
తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తామని లక్ష్మణరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవలో ముందుంటామని అన్నారు. మానవతా సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కరీంనగర్ జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో మానవతా సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. రక్తదాన కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య సేవలు, యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
సమాజంలోని ప్రతి వర్గానికి రెడ్ క్రాస్ సేవలు మరింత చేరువయ్యేలా సమన్వయంతో పనిచేస్తామని, సంస్థ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నూతన కార్యవర్గం కృషి చేస్తుందని లక్ష్మణరావు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులకు టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎడ్ల అరవింద్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీందర్ సింగ్, పట్టణ సంఘం అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, నాయకులు రాజశేఖర్ రెడ్డి, వెలిచాల సుమంత్రావు రాంమోహన్ కోండల్ రెడ్డి జలాలుద్దిన్ అక్బర్ తదితరులు అభినందనలు తెలిపారు.

